మహబూబ్‌నగర్, జనవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : త్వరలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ముందస్తుగానే ఎన్నికల వేడి పుట్టిస్తోంది. సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన రాజకీయాల్లో కాక పుట్టిస్తుంది. ఇటీవల జరిగిన పం చాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికార పార్టీకి ధీటుగా స్థానాలు గెలుచుకొని సవాల్ విసిరింది. దీంతో రాబోయే మున్సిపల్ ఎన్నికలను కూడా పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి ఇతర పార్టీ నాయకులు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఎం బీసీ మైదానంలో జరిగే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు.
ఈ సభలోనే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించనున్నారు. అంతకుముందు జిల్లా కేంద్రం సమీపంలో ని అప్పనపల్లి నుంచి భా రీ బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లా కేంద్రం గులాబీమయంగా మారింది. దారి పొడుగు నా గులాబీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో ఘనంగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఎంబీసీ మైదానంలో కేటీఆర్ పాల్గొనే సభ ఏ ర్పాట్లను ఆదివారం మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా సీఎం సొంత జిల్లాలో మున్సిపల్ ఎన్నికలవేళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది.
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలమూరు జిల్లా కేంద్రంలో అడుగుపెట్టనున్నారు. ఇక్కడి నుంచి ము న్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని నాయకులకు కా ర్యకర్తలకు పిలుపు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా కేటీఆర్ శ్రీకారం చుట్టనుండడంతో కాంగ్రెస్ వర్గాల్లో వణుకు పుడుతుంది. ఉమ్మ డి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 17మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలను బీఆర్ఎస్ క్లీన్‌స్వీ ప్ చేసింది. ఈసారి కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీని ఇవ్వబోతోంది. ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ క్యాడర్‌ను ఏకతాటి పైకి తీసుకురావడంలో మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు సఫలీకృతులయ్యారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మహబూబ్‌నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్ దిశగా అడుగులు వేయించారు. అప్పట్లో మంత్రివర్గంలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ జిల్లాకేంద్రంలో ఉన్న మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చేందుకు కృషి చేశారు. కార్పొరేషన్‌కు అవసరమైన అన్ని హంగులను సమకూర్చి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మున్సిపల్ కార్పొరేషన్‌గా పాలమూరు అవతరించడంలో కీలకపాత్ర పోషించారు. మున్సిపాలిటీ తీర్మానంతో పాటు కార్పొరేషన్‌కు అవసరమైన జనాభాను జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న గ్రామాలను కలుపుకొని కార్పొరేషన్ స్థాయిని పెంచారు.
ఈలోగా ఎన్నికలు రావడంతో మున్సిపల్ కార్పొరేషన్ జీవోను విడుదల చేయలేకపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలు ఎన్నికలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో కార్పొరేషన్ ఫైల్ కూడా ఆటకెక్కింది. చివరకు ఒత్తిళ్లకు లొంగి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంపించిన ప్రతిపాదనలను ఏడాదిన్నర తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించింది. అయితే కార్పొరేషన్‌కు తొలిసారి ఎన్నికలు జరగ నుండడంతో పార్టీ నేతలు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎలాగైనా కార్పొరేషన్ దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తుండడంతో అధికార పార్టీ నేతల్లో గుబులు రేగుతోంది. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ అధికార పార్టీ నేతలు ముందస్తుగానే సీఎంతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయించాలని చూశారు. అయితే ఆ పనులన్నీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైనవి కాకపోవడం.. కొత్తగా జిల్లా కేంద్రానికి ఇచ్చింది ఏమీ లేకపోవడంతో వెనక్కు తగ్గారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన వాటికే ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తే పరువు పోతుందని భావించి కాంగ్రెస్ అధిష్టానం ఈ కార్యక్రమాన్ని తోసి పుచ్చింది.
ఈలోపు ఎన్నికల షెడ్యూల్ దగ్గరకు వస్తుండడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను మాజీ మంత్రులు దగ్గరుండి ఖరారు చేయించారు. అంతేకాకుండా కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తుండడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. పదవులను ఆశించే నేతలంతా వర్గాలుగా విడిపోవడం…బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుండడంతో ఎక్కడ పరువు పోతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ దళంలో మరింత జోష్ నింపేందుకు కేటీఆర్ పర్యటన ఉపయోగపడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ బహిరంగ సభ, బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని మాజీమంత్రులు శ్రీనివాస్‌గౌడ్ లక్ష్మారెడ్డిలు కోరా రు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన అ నంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉదయం 10గంటల వరకు కేటీఆర్ మహబూబ్‌నగర్ చేరుకుంటారని.. అప్పనపల్లి సమీపం నుంచి బైక్ ర్యాలీ కొనసాగుతుందన్నారు. జిల్లా కేంద్రం ప్రధాన రహదారి వెంట ఈ ర్యాలీ సాగుతుందని ఏనుగొండ, శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీ, వెంకటేశ్వర కాలనీ, మెట్టుగడ్డ, గవర్నమెంట్ దవాఖాన, న్యూ టౌన్ బస్టాండ్ల మీదుగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని అక్కడి నుంచి ఎంబీసీ మైదానంలో జరిగే బహిరంగ సభ లో పాల్గొంటారని తెలిపారు. ఈ సభలో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచులతోపాటు వార్డు స భ్యులను కూడా కేటీఆర్ సన్మానిస్తారన్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో మాట్లాడుతారని, మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని శ్రీకారం చుడ తారన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.