గద్వాల : జిల్లాలో బీజేపీ (BJP) , కాంగ్రెస్‌ను ( Congress) కృష్ణా నదిలో తోయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆంజనేయులు గౌడ్ (Anjaneyulu Goud ) అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రజతోత్సవ సన్నాహక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గద్వాల ప్రజలు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు. కేసీఆర్( KCR ) పాలనలో పేదళ్ల పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి రోల్ మోడల్‌గా నిలిస్తే రేవంత్ రెడ్డి 16 నెలల పాలనలో రాష్ట్రాన్ని దివాలా తీయించాడని ఆరోపించారు. గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి త్వరలో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఎమ్మెల్యేను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి అధిష్టానం సిద్ధంగా లేదన్నారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి పథంలో నడుస్తుంటే గద్వాల నియోజకవర్గం వెనుకబడిపోయింది ఆరోపించారు. హెచ్‌సీయూ భూములను , లగచర్ల భూములను బడా బాబులకు ప్రభుత్వం విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నీరో సర్కార్ పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లలో 1.60 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో ఇచ్చాడని గుర్తు చేశారు. వరంగల్‌లో ఈనెల 27న జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు బాస్ హనుమంతు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.