వనపర్తి, జూలై 13 : రైతుల అభిప్రాయ సేకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడం తప్పా అన్నదాతలకు ఒరగబెట్టిందేమీ లేదని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ విమర్శించారు. శనివారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నివాసంలో గురువారం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణాధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించడం చేతగాకనే అభిప్రాయాలంటూ మోసం చేస్తున్నదని మండిపడ్డారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో తెలుపాలన్నారు. అభిప్రాయ సేకరణ పూర్తిగా మోసపూరితమైందన్నారు. రాష్ట్రంలో 71లక్షల రైతు కుటుంబాలుండగా, కేసీఆర్ సర్కారు 69లక్షల రైతు కుటుంబాలకు రైతుబంధు ఇచ్చిందన్నారు. కేవలం 8శాతం ఉన్న భూస్వాముల కోసం 92శాతం ఉన్న రైతాంగానికి రైతుభరోసా నిలిపివేయడం సరికాదన్నారు. పదేండ్లలో రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ మంత్రులు ఆరోపణలు చేస్తున్నారని, రెండు విడుతల్లో రూ.56లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. అలాగే రైతుబీమా ద్వారా లక్షా 10వేల మంది రైతు కుటుంబాలకు పరిహారం అందించామన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా చేసింది శూన్యమన్నారు. రైతుభరోసాపై కాంగ్రెస్ నాయకులకు గుర్తింపుకార్డులు ఇచ్చి అభిప్రాయ సేకరణ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. వారి కార్యకర్తలే రైతులయ్యారని, వాళ్ల అభిప్రాయాన్ని రైతుల అభిప్రాయంగా సబ్ కమిటీ స్వీకరించడం రైతులను మోసం చేయడమేనన్నారు. కలెక్టరేట్లో మీటింగ్ ఏర్పాటు చేసి కిలోమీటర్ దూరం నుంచే మూడంచెల భద్రత ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో మంత్రులు టూరిస్టుల మాదిరిగా తిరుగుతున్నారని మండిపడ్డారు. టైంపాస్ రాజకీయాలు మాని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో కౌన్సిలర్లు నాగన్నయాదవ్, కంచె రవి, బీఆర్ఎస్ నాయకులు యుగందర్‌రెడ్డి, మన్యం, రాము, వెంకటేశ్, శ్రీను, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.