నవాబ్‌పేట, డిసెంబర్26 : మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సోషల్‌మీడియా కార్యకర్త దండు స్వామి(28) అనే వ్యక్తి గురువారం రాత్రి జడ్చర్ల సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాకర్లపహాడ్ గ్రామానికి చెందిన దండు స్వామి గురువారం తన సొంత పని నిమిత్తం సొంత ద్విచక్రవాహనంపై జడ్చర్లకు వెళ్లి తిరిగి రాత్రి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా జడ్చర్ల మండలం బండమీదిపల్లి వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్వామి గత ఐదారు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చురుగ్గా పని చేస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మండల నాయకులు స్వామి మృతిపై ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
స్వామి మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని వారు పేర్కొన్నారు. దండు స్వామి మృతితో మరొకరి జీవితంలో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో మండల బీఆర్ఎస్ నాయకుల సూచన మేరకు స్వామి తల్లిదండ్రులు ఉషనమ్మ, వెంకటయ్య, భార్య లావణ్య అతడి కళ్లను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలో పోస్టు మార్టం పూర్తయిన వెంటనే, దండు స్వామి కళ్లను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు దానం చేశారు. మండల నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సమక్షంలో అతడి కళ్లను కుటుంబ సభ్యులు.. ఎల్వీ ప్రసాద్ దవాఖాన వైద్యులకు దానం చేశారు. పుట్టెడు దుఖంలోనూ కుమారుడి కళ్లను దానం చేయడంపై పలువురు స్వామి కుటుంబ సభ్యులను అభినందించారు. కాగా దండు స్వామి మృతితో కాకర్లపహాడ్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.