కొల్లాపూర్, డిసెంబర్ 5 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ సానుభూతిపరులపై అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు తెగబడింది. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో దళిత వర్గానికి చెందిన బీఆర్ఎస్ సానుభూతిపరురాలు సర్పంచ్ అభ్యర్థి శశికళకు మద్దతుగా ఉన్నారన్న నెపంతో పేదోడి ఇంటిపైకి అధికార కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ను ప్రయోగించి బాధిత కుటుంబాన్ని రోడ్డుపాలు చేసింది. కొల్లాపూర్ పట్టణంలోని 6వ వార్డులో ఎల్లూరుకు చెందిన మీయేటి కురుమయ్య 8 సంవత్సరాల నుంచి డబ్బాలో కూరగాయాలను పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు.
అయితే ఎల్లూరులో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓటమి పాలవుతాడేమోనని గ్రహించిన అధికార పార్టీ నేతలు గులాబీ పార్టీ సానుభూతిపరులపై దాడులకు తెగబడ్డారు. గురువారం అకారణంగా కురుమయ్య కురగాయాల డబ్బాను అధికారులు తొలగించారు. మున్సిపల్ సిబ్బంది ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా.. కనీసం డబ్బాలోని కురగాయాలను సైతం తీసుకునేందుకు అవకాశం ఇవ్వకుండా జేసీబీతో ఊరిచివరి వరకు విసిరికొట్టారు.
బీఆర్ఎస్ సానుభూతిపరులం కావడంతోనే మా పొట్టకొడుతున్నారని బాధిత కుటుంబం వాపోయింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి రాజకీయాల కోసం.. పేదోడి ఇంటిపైకి బుల్డోజర్ పంపించడంపై మండిపడ్డారు. నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయని ఆగ్రహం చెందారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి బీఆర్ఎస్ నాయకులపై బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ అరాచకవాదులకు ప్రజాస్వామ్య పద్ధతిలోనే తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.