అయిజ, డిసెంబర్ 3: అలంపూర్ నియోజకవర్గంలో ప్రతిరౌండ్‌లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు మెజార్టీ సాధించడంతో గులాబీ శ్రేణులు, సంబురాలు చేసుకున్నారు. ఆదివారం అయిజ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లోని వాడవాడలో గులాబీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ధాటికి కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలివేయబడిందని పార్టీనేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని అలంపూర్ ఓటర్లు చిత్తుచిత్తుగా ఓడించడంతో బీఆర్ఎస్ కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పట్టణంలో బీఆర్ఎస్ కారకర్తలు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయుడును అయిజకు చెందిన నాయకులు, కార్యకర్తలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఉండవెల్లి డిసెంబర్ 3: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు అత్యధిక మోజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్‌పై గెలుపొందడంతో గ్రామా గ్రామాన బీఆర్ఎస్ శ్రేణులు భారీ బాణసంచా కాలిచి సంబురాలు చేసుకుని స్వీట్స్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు స్వగ్రామం పుల్లూరు నుంచి యువకులు భారీ బైక్ ర్యాలీతో అలంపూర్ చౌరస్తాకు చేరకుని సంబురాలు చేసుకున్నారు. అలాగే తక్కశిల, ఉండవెల్లి, మారమునగాల, ప్రాగటూర్, బైరాపురం, బొంకూరు, ఇటిక్యాలపాడులోని ప్రధాన కూడళ్లలో సంబురాలు చేసుకున్నారు.
వడ్డేపల్లి, డిసెంబర్ 3: బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు 30వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందడంపై మండలంలోని నాయకులు వేర్వేరుగా సంబురాలు జరుపుకొన్నారు. చల్లా నాయకత్వంలో అందరు ఊహించినట్లుగానే అఖండ మెజార్టీ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కరుణ, రాజోళి వైస్ ఎంపీపీ రేణుక, రవి, నాగులు, మాదన్న, మధు, శ్రీను, రంగస్వామి పాల్గొన్నారు.
ఇటిక్యాల, డిసెంబర్ 3: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి మండలంలోని గ్రామాలన్నీ బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడికి మెజార్టీని ఇచ్చాయి. మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒకటి రెండు చిన్నచిన్న గ్రామాల్లో తప్పా అన్ని గ్రామాల్లో ప్రజలు బీఆర్ఎస్నే ఆదరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో అల్లంపూర్ నియోజకవర్గ ఎన్నికల లెక్కింపు చేపట్టగా.. మొదటి రౌండ్ ఇటిక్యాల మండలంలో నుంచే ప్రారంభమైంది. మండలంలోని 49 పోలింగ్ కేంద్రాలలో నాలుగైదు పోలింగ్ కేంద్రాలు మినహా అన్ని కేంద్రాలలో బీఆరెస్ అభ్యర్థికే మెజార్టీ వచ్చింది.
ఎర్రవల్లి చౌరస్తా, డిసెంబర్ 3: ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు ఆదివారం వెలువడిన ఫలితాల్లో భారీ మెజార్టీతో గెలవడంతో ఎర్రవల్లి మండల కేంద్రంలో సంబురాలు జరుపుకొన్నారు. బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డి, ఎర్రవల్లి మండల ప్రజాసమితి సభ్యులు ఎర్రవల్లి చౌరస్తాలో పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచిపెట్టారు.
మానవపాడు, డిసెంబర్ 3: మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు పటాకులు కాల్చి డ్యాన్సులు చేశారు. ఆయా గ్రామాల్లోని నాయకులు విజయుడు గెలుపులో కీలకపాత్ర వహించిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని కలిసేందుకు కార్యకర్తలతో కలసి కర్నూలు పట్టణానికి భయలుదేరి వెళ్లారు.