మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎవరిన్ని కుట్రలు చేసినా.. ఇచ్చిన హామీ లు, పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పి మో సం చేసిన కాంగ్రెస్ దమననీతిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోస్గి పట్టణంలో జరిగే రైతు నిరసన దీక్షలో పాల్గొనడానికి వస్తున్నారు. సోమవారం కోస్గి పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో జరిగే రైతు నిరసన దీక్షకు పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. వేలాది మంది రైతులతో నిర్వహించే ఈ సభకు కేటీఆర్‌తోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మం త్రులు, మహబూబ్‌నగర్, వికారాబాద్ పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొంటున్నారు.
కొడంగల్ నియోజకవర్గంతో పాటు నారాయణపేట జిల్లా నుంచి పెద్దఎత్తున రైతులు హాజరవుతున్నారు. ఇప్పటికే పార్టీ నేతలు ఆయా మండలాల్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి రైతులను నిరసన దీక్షకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమిచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాకపోవడంతో భారీ ఎత్తున రైతులు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆదివారం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు సలీం, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శాసం రామకృష్ణ ఇతర పార్టీ నేతలు కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.
మరోవైపు కేటీఆర్ రైతు నిరసన దీక్షకు తరలి వెళ్లకుండా బిగ్ బ్రదర్ రంగం లో దిగినట్లు సమాచారం. కొడంగల్ నియోజకవర్గం నుంచి రైతులు పాల్గొనకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కోస్గికి కేటీఆర్ వస్తుండడంతో పోలీసు యంత్రాం గం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. మరో వైపు బీఆర్ఎస్ నేతలపై నిఘా ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లో రైతు నిరసన దీక్షను విజయవంతం చేసి.. ముఖ్యమంత్రి అబద్ధాలను ఎండగడతామని పార్టీ నేతలు అంటున్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ తరఫున నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలు కనీవిని ఎరగని రీతిలో విజయవంతం అవుతుండడంతో సర్కారులో గుబులు రేగుతోంది. సోమవారం సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలోని కేటీఆర్ పర్యటిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన దీక్ష చర్చనీయాంశంగా మారింది. గత నెల రిపబ్లిక్ డే రోజు ఇదే కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాలుగు పథకాలను అట్టహాసంగా ప్రారంభించారు. అర్ధరాత్రి నుంచి రైతుల ఖాతాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో టకిటకీమంటూ డబ్బులు పడతాయని హామీ ఇచ్చారు. సాక్షాత్తు సీఎం ఇచ్చిన హామీకే విలువ లేకుండా పోయిందని.. అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నారని ఇదే వేదికగా రేవంత్ ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 420 వాగ్దానాలను చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 14 నెలలవుతున్నా ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని.. బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రైతుబంధు ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు ఇవ్వలేదని.. ముఖ్యమంత్రి హోదాలో ఈ పండుగకు వేస్తా ఆ పండుగకు వేస్తా అంటూ కాలం గడిపాడని.. రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని..
కల్యాణలక్ష్మి తోపాటు తులం బంగారం ఇస్తామంటూ బూటకపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. రూ.2000 పింఛన్ రూ.4000 చేస్తామని.. మహిళలకు రూ.2500 అకౌంట్లో వేస్తామని.. అర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయడం ఆ గ్రామంలో కూడా లబ్ధిదారులకు వేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈ మోసాలను ఎండ కట్టేందుకే పార్టీ తరఫున చేపట్టిన రైతు నిరసన దీక్షకు పెద్ద ఎత్తున స్పందన వస్తుందని.. పార్టీ నేతలు అంటున్నారు.
కొడంగల్ రైతు మహాధర్నాకు విచ్చేస్తున్న కేటీఆర్‌కు పార్టీ నేతలు ఘనస్వాగతం పలుకుతున్నారు. కోస్గి పట్టణం మొత్తం గులాబీ మయంగా మారింది. ఇదిలా ఉండగా జూనియర్ కళాశాల మైదానంలో జరిగే కేటీఆర్ సభకు పోలీసులు నిఘా పెట్టారు. మఫ్టీ పోలీసులు స్టేజీ సమీపంలోని తిరుగుతూ ఎవరెవరు వచ్చి పోతున్నారు.. మీడియాతో ఏం మాట్లాడుతున్నారు? అనే విషయాలను ఆరా తీస్తుండడం కనిపించింది. మరోవైపు గ్రామాల్లో మండలాల్లో బీఆర్ఎస్ నేతలపై కూడా నిఘా ఉంచారు. రైతు నేరసన దీక్ష విజయవంతం కాకుండా బిగ్ బ్రదర్ సర్వశక్తులు వడుతున్నట్లు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
జనవరి 26న సాక్షాత్తు అంబేద్కర్ రాజ్యాంగం అమలైన రోజు కోస్గి మం డలం చంద్రవంచ గ్రామంలో నాలుగు పథకాలను ప్రారంభించి అర్ధరాత్రి నుం చి డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు తదితర హామీలు కూడా ఆటకెక్కించారు. రైతు భరోసా ఇస్తామని ఆరుసార్లు ముఖ్యమంత్రి హోదాలో అబద్ధాలు వల్లించారు. సంక్రాంతికి వేస్తామని.. దసరాకు ఇస్తామని.. దీపావళికి వేస్తామని.. చెప్పి ఒక్క ఎకరా వరకు రైతుభరోసా వేశామని చెబుతున్నారు.. అది కూడా ఇంతవరకు పూర్తిస్థాయిలో పడలేదు.
ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతుంటే మంత్రులు తలో మాట మా ట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమ లు చేసే వరకు మా పోరాటం ఆగదు. ఆ పార్టీ మెడలు వంచుతామని ప్రజలకు జవాబుదారీగా ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. కోస్గిలో జరిగే రైతు నిరసన దీక్షకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవంతం చేసి తీరుతాం. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలి.
– పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్
కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి బలవంతంగా గిరిజనుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుండడంతో లగచర్ల రైతులు తిరగబడ్డారు.. జైలుకు సైతం వెళ్లి వచ్చారు. అప్పట్లో లగచర్ల రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండదండగా నిలిచింది. ఫార్మా క్లస్టర్‌ను వెనక్కి తీసుకున్నట్లే అని ప్రకటించిన ప్రభుత్వం వెనువెంటనే మళ్లీ పారిశ్రామిక కారిడార్‌కు భూసేకరణ చేపట్టింది. ఈ భూసేకరణ కూడా గిరిజన రైతులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోస్గికి వస్తున్న కేటీఆర్ మార్గమధ్యంలో లగచర్ల తదితర గ్రామాల రైతులను పరామర్శించనున్నారు.