కల్వకుర్తి, ఫిబ్రవరి 18 : పాలనను గాలికొదిలేసి రాష్ర్టా న్ని అధోగతి పాలు చేసిన రేవంత్‌రెడ్డికి ఏడాదిన్నర గడిచినా ఇంకా లంకెబిందెలు దొరకలేదా అని బీఆర్ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మున్సిపాలిటీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన మంగళవారం మాజీఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన రైతు మహాదీక్షలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభు త్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు.
ఎన్నిలకు ముందు 420 హామీలు ఇచ్చారని, వాటిని ఎందుకు అమలు చేయ డం లేదని ప్రశ్నించారు. అన్నదాతలకు రూ.2లక్షల వరకు రుణమాఫీ, ఎకరాకు రైతు భరోసా రూ.15వేలు ఇస్తామని 15 నెలలుగా ఎందుకు గారడీ చేస్తున్నారని రేవంత్‌రెడ్డిపై మం డిపడ్డారు. ఇంకా లంకెబిందెలు దొరకలేదా.. వాటి కోసం తట్టాపార తీసుకుని తిరుగుతున్నావా అని ఎద్దేవా చేశారు.
జనవరి 26న టకీ టకీ మని రైతుభరోసా డబ్బులు రైతు ల ఖాతాల్లో పడతాయని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పాడు.. మరీ టకీ టకీ మని రైతు భరోసా డబ్బులు పడ్డాయా అని కేటీఆర్ అన్నదాతలను ప్రశ్నించారు. రైతులు లేదు..లేదు అంటూ సమాధానాలు ఇవ్వడంతో.. ఇదీ రేవంత్ పరిపాలన గొప్పతనం అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ అనే అతడు సహజంగా మోసకారి. మోసం చేయడం అతడి నైజం. అది ఎలాగంటే ఎన్నికలు ముందు రూ.2లక్షల రుణామాఫీ చేస్తానని, కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే సోనియమ్మ పుట్టిన రోజు కానుకగా అమలు చేస్తానని, ఎకరాకు రైతు భరోసా రూ.15వేలు ఇస్తానని హామీ ఇచ్చి సోనియమ్మ రెండు పుట్టిన రోజులు గడిచిపోయాయినా రుణమాఫీని గంగలో కలిపి, రైతు భరోసాను రూ.12వేలు కుదించి ఇప్పటికీ టకీ లేదు.. టికీ లేదంటూ మండిపడ్డారు.
ఇప్పటికీ రైతుభరోసా పైసలు వెయ్యనేలేదని, కేసీఆర్ సర్కారులో గత యాసంగిలో రైతుబంధు డబ్బులు జమచేసి పంపిణీ చేయడానికి సిద్ధమవ్వగా, ఈ నీచ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోడ్ అంటూ అడ్డుకున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే వేశారా అంటే అదీలేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం కేసీఆర్ దాచిన రైతుబంధు డబ్బులను ఇచ్చి గొప్పలు చెప్పుకున్నారన్నారు. వానకాలం రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయని రైతుభరోసా డబ్బులు వేస్తామని ఊరిస్తున్నారని మండిపడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ముఖ్యమంత్రి ఏం చెప్పినా మోసమేనని, అదేం దురదృష్టమేమోగాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తిట్టిన తిట్లు ప్రపంచంలో ముఖ్యమంత్రిని తిట్టకపోవచ్చు.. మరీ కొత్త కొత్త తిట్లను రేవంత్‌రెడ్డిపైకి వదులుతున్నారన్నారు.
కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగమని, రైతు రాజుగా ఉన్నాడని కేటీఆర్ అన్నారు. 12 విడుతలుగా రూ.73వేల కోట్లు రైతుబంధు రైతుల ఖాతాల్లో ఏ ఇబ్బందీ లేకుండా జమచేసినట్లు గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలోనూ అన్నదాత అగుడు కావొద్దని రైతుబంధు ఇచ్చినట్లు తెలిపారు. రైతు చనిపోతే..అతడి కుటుంబం రోడ్డు పాలు కావొద్దని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబీమా ఇచ్చిన ఘటన కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రూ.లక్ష వరకు రుణమాఫీ చేశారని, పెట్టబడుల సీజన్ వస్తే చాలు రైతులకు కేసీఆర్ ఉన్నాడనే అభయం ఉండేదని తెలిపారు. వానాకాలం, యాసంగి సీజన్ ప్రారంభంలోనే టింగ్ టింగ్ మని రైతుబంధు డబ్బులు పడేవని గుర్తుచేశారు. కేసీఆర్ టింగ్ టింగ్ మని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మన మాయల మరాఠి మోసకారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టకీ టీకీ అనే కొత్త పదాన్ని చెప్పి.. రైతులకు పంగనామాలు పెడుతున్నాడని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ నియోజకవర్గం కొడంగల్ పోయి నా.. అత్తగారి నియోజకవర్గం కల్వకుర్తి వచ్చినా జనం మా త్రం ఛీ ఛీ రేవంత్ అంటున్నారన్నారు. వలసపోయిన కొ డంగల్‌లో గౌరవం లేదని, కనీసం అత్తగారి నియోజకవర్గంలో కూడా రేవంత్‌కు గౌరవం లేకపోవడం సిగ్గుచేటన్నా రు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా 420హామీల తో ప్రజలను మోసం చేస్తే చీత్కారాలు తప్పా సన్మానాలు చేస్తారా అంటూ నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సం క్షేమం కోసం ఏ ఒక్క మంచిపనైనా చేశారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ 36 సార్లు తిరిగి 36 పైసలు కూడా తీసుకురాలేదని, విదేశాల పేరుతో కాలం గడపడం సిగ్గుచేటన్నారు.
తనతోపాటు తన అన్నదమ్ముల కడుపునిండితే చాలనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ పాలన సాగుతుందని కేటీఆర్ ధ్వజమెత్తారు. సహజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రేవంత్ అదే పంథాతో ముందుకు సాగుతున్నారన్నారు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంటూ తన అన్నదమ్ములతో భూవ్యాపారాలు చేయిస్తున్నాడని ఆరోపించారు. వెల్దండ మండలంలో ఇప్పటికే 500 ఎకరాలు సంపాదించిన రేవంత్ కుటుంబం ఈ మధ్య మరో 1000 ఎకరాలు కూడబెట్టిందని, అత్తగారి ఊరు వద్ద మరో 1,200 ఎకరాల కోసం ట్రిపుల్ ఆర్ రోడ్డు అటు నుంచి వెళ్లేలా అలైన్మెంట్ మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఇదంతా పక్కన బెడితే వ్యాపారాలు ఎవరైనా చేసుకోవచ్చు తప్పులేదు గానీ.. ప్రజా సమస్యలు విస్మరించి, రైతులను గాలికొదిలి అధికారాన్ని స్వార్థానికి ఉపయోగించకుకోవడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు.
పోసిన పాల బిల్లులు ఇవ్వకుండా, అమ్ముకున్న వడ్లకు బోనస్ ఇవ్వకుండా రైతులను వేధించడం అ త్యంత దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. పాల బిల్లులతో బతికే రైతులు పాల బిల్లులు ఇవ్వకుంటే ఎలాగని, ప్రభుత్వానికి సిగ్గుందా అంటూ మండిపడ్డారు. 5 బిల్లులు బకాయి ఉంటే పాడి రైతులు ఎట్లా బతుకుతారని ప్రశ్నించారు. వెంటనే పాలబిల్లులు బకాయి లేకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. సన్న వడ్లు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నా రైతులకు కష్టాలు వచ్చేవి కాదని, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామనడంతో సర్కారును నమ్మి రైతులు నిలువునా మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశా రు. మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు బోసన్ ఊసే లేదని, ఇంతకంటే మోసకారి ప్రభుత్వం ఇంకెక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు.
ఎన్నికల సభ కాదు.. జనాన్ని డబ్బులు పెట్టి తీసుకురాలేదు.. తమకష్టాలు చెప్పుకుంటూ, ఇచ్చిన హామీలు ఆమ లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు దీక్షకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీఆర్ వస్తున్నారనే సమాచారం మేరకు రైతులతోపాటు ఇతర సబ్బండ వర్గాల ప్రజలు పెద్దఎత్తున ఆమనగల్లుకు తరలివచ్చారు. దీంతో ఆమనగల్లు గులాబీమయంగా మారిపోయింది. పెద్ద ఎత్తు న స్వాగత ఏర్పాట్లు చేశారు. పోస్టాఫీస్ నుంచి సభాస్థలి వరకు రోడ్డుకు ఇరువైపులా కేటీఆర్‌పై పూలు చల్లారు.
మ హా రైతు దీక్షలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీలు వాణీదేవి, నవీన్‌కుమార్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు అంజ య్య, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోళి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పల వెంకటేశ్, నాగం శశిధర్‌రెడ్డి, ఎడ్మ సత్యం, విజయ్‌గౌడ్, సూర్యప్రకాశ్‌రావు, గోవర్ధన్, పుట్టా రాంరెడ్డి, వెంకటయ్యగౌడ్, హైజాక్, మధుసూదన్‌రెడ్డి, ఆనంద్, యాదగిరి, శేఖర్, సోమయ్య, అల్లాజీగౌడ్, వెంకటేశ్, రాజుతో పాటు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, గురుకులాల పిల్లలు ఆత్యహత్యలు చేసుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యకు పరిష్కారం ఆత్మహత్య కాదని, ప్రాణం చాలా విలువైనదన్నారు. ఆత్మహత్యకు పాల్పడవద్దని కోరారు. కష్టాలు వస్తే ఎదురిద్దాం, కలిసికట్టుగా ముందుకు సాగుదామని, రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరుగుతుందని ధైర్యం చెప్పారు. ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలేనని మండిపడ్డారు. సంవత్సరంన్నర కాంగ్రెస్ పాలనలో 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 56 మంది గురుకుల విద్యార్థులు పిట్లాల్లా రాలిపోయారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మోసపోవద్దు గోస పడ్తాం.. గారడీ గాళ్ల మాటలకు మోసపోయాం.. గోస పడుతున్నాం.. ఇకముందు మోసపొవద్దు.. ఇదే విషయమై రాష్ట్ర ప్రజలను చైతన్యవంతులుగా చేసేందుకు రాష్ట్రమంతా పర్యటిస్తున్నా. అధికారంపై వ్యామోహంతో కాసుల కోసం మాయమాటలు చెబుతారు. గత ఎన్నిలల్లో ఇదే జరిగింది. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచారు. అందుకే మరోసారి మోసపోవద్దు. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కాంగ్రెసోళ్లు మన ఇండ్ల వద్దకు ఓట్ల కోసం వస్తే గల్లా పట్టి నిలదీయాలి. రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12వేలు, స్కూటీ, ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగ భృతితోపాటు 420 హామీలు ఏమయ్యాయని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. చైతన్యంగా ఉండాలని, మంచి చెడులను గుర్తిస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని పదేండ్లు కంటికి రెప్పలా కాపాడుకొని అభివృద్ధి చేసుకున్నామని, ప్రజల కోసం నిలబడేది, కష్టపడేది బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. త్వరలోనే మనకు మంచి రోజులు వస్తాయని, కేసీఆర్ సారు మళ్లీ మన ముఖ్యమంత్రిగా వస్తారని, మళ్లీ రామరాజ్యం వస్తుందని ధైర్యం చెప్పారు. రైతులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
పోయినదేదో దొరికితే ఆనందం ఎట్టుంటదో కేటీఆర్‌ను చూడగానే అలాంటి ఆనందాన్ని రైతులు వ్యక్తపరిచారు. ఆప్తుడిని చూసిన భావన రైతుల్లో కదలాడింది. కేటీఆర్‌పై పూలు చల్లుతూ తమ సంతోషాన్ని చాటుకున్నారు. మళ్లీ మాకు మంచిరోజులు రాబోతున్నాయని ఆనందం కనబరుస్తూ కేటీఆర్‌తో కరచాలానికి ఎగబడ్డారు. మోసపోయాం.. తప్పులను సరిదిద్దుకుంటాం.. ఇక మీ వెంటే నడుస్తామని ఆమనగల్లు ముఖఃద్వారం నుంచి రైతుదీక్ష సభాస్థలి వరకు రైతులు కేటీఆర్ వెంట ర్యాలీగా వచ్చారు. రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా వేదనకు గురిచేస్తున్న రేవంత్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ కల్వకుర్తి నియోజకవర్గమే కాదు..పక్క నియోజవర్గాలకు చెం దిన రైతులు స్వచ్ఛందంగా ఆమనగల్లు రైతు మహా దీక్షకు తరలివచ్చారు. ఆమనగల్లు రైతు దీక్ష రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కళ్లకు కట్టినట్లు కనిపించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో పూర్తిగా విఫలమైంది. రైతుల కష్ట, సుఖాలు తెలుసుకోవడానికి కోర్టు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది. ఇంతటి దౌర్భాగ్యపు పాలనను తెలంగాణ ప్రజలకు రావడం దురదృష్టకరం. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తాం.
– గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను మోసగించిన రేవంత్‌రెడ్డికి గుణపాఠం తప్పదు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలు, రైతులు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.
– జైపాల్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ రైతాంగా న్ని, ప్రజలను కాంగ్రెస్ ప్ర భుత్వం నమ్మించి మోసగించింది. పది లక్షల మం దికి రైతు భరోసా ఎగవేసిం ది. రుణమాఫీ వందశాతం చే స్తామని రైతులను ఇబ్బందుల పాలు చేసింది. వడ్లకు బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పింది.
– నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి
కాంగ్రెస్ గారడీ మా టలు ప్రజలు నమ్మొద్దు. రాబోయే ఎన్నికల్లో త గిన బుద్ధి చెప్పాలి. ఇప్పటికే 420 హామీలిచ్చి వా టిని నెరవేర్చడంలో పూ ర్తిగా విఫలమయ్యారు. ఇంత దిగజారుడు సర్కారును గతంలో ఎన్నడూ చూడలేదు. కాంగ్రెస్‌పై ప్రజల తిరుగుబాటు తప్పదు.
– శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి
రాష్ట్రంలో గురుకులాలను మృత్యుకుహరాలుగా మార్చారు. 56మంది విద్యార్థుల మృతికి కారణమైన సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు పెట్టాలి. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం విద్యార్థుల మృతికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. సర్కారు తీరు ఇలాగే కొనసాగితే గురుకులాలు ఖాళీ కావడం ఖాయం.
– ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత