BRS : ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మాగనూరు మండల అధ్యక్షుడు కె ఎల్లారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మాగనూరు మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకు మాగనూరు బ్రిడ్జి వద్దకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్దకు చేరుకుని సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మక్తల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఎల్లారెడ్డి తెలిపారు. ఆరు గ్యారెంటీల అమలు, ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్పుపై సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఎల్లారెడ్డి కోరారు. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరై ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.