వనపర్తి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ : వనపర్తిలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. రైతులకు సకాలంలో ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ధర్నా చేస్తారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పార్టీ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ రైతన్నలకు సకాలంలో ఎరువులను పంపిణీ చేయాలని కోరినా పోలీసులు అరెస్టులకు పాల్పడం సరికాదన్నారు.
ఎరువుల పంపిణీ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ రైతులను నట్టేట ముంచుతున్నాయని ఆరోపించారు. చివర కు రైతుల పక్షాన యూరియా కోసం ఆందోళన చేయాలన్న తమ ప్రయత్నాలను సై తం పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామ్యంగా పేర్కొన్నారు. ఎరువులు ఇవ్వ రు.. ఆందోళన చేయనివ్వరు.. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని నాయకులు ప్రశ్నించారు.
అధికారులు, పోలీసులు అధికారపార్టీకి బానిసలుగా మారిపోయారని, న్యాయం అడిగితే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం దున్నపోతుకు వినతిపత్రం అందజేసి వారు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు పరంజ్యోతి, నాగన్నయాదవ్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, ఉంగ్లం తిరుమల్, కంచ రవి, స్టార్ రహీం, మహేశ్వర్‌రెడ్డి, మాధవ రెడ్డి, హేమంత్, భాగ్యరాజ్, హుస్సేన్, అలీం, సాదిక్, లక్ష్మణ్ గౌడ్, రాము తదితరులు పాల్గొన్నారు.