వనపర్తి, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం అనైతికం అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అన్నారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం వనపర్తిలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశా రు.
ఈ సందర్భంగా గట్టుయాదవ్ మాట్లాడుతూ ఒక పక్క యాసంగి పంటలు ఎండిపోతున్నాయి.. మరోపక్క ప్రభుత్వ పాలన పక్కదారి పట్టిందని, అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అడిగితే ఆయన్ను సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదని మాట్లాడిన మాజీ మంత్రిని పథకం ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఆరోపించారు. అన్‌పార్లమెంటరీ పదాలు మాట్లాడారని తప్పుడు అభియోగంతో సస్పెండ్ చేసిన ప్రభుత్వ చర్యను ప్రతి ఒక్కరు మీడియాలో చూసి నవ్వుకుంటున్నారన్నారు.
దళిత స్పీకర్ పేరు చెప్పి కాంగ్రెస్ అసెంబ్లీలో కూడా రాజకీయాలు చేస్తూ సభను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. వెంటనే జగదీశ్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్ట ణ అధ్యక్షుడు పలుస రమేశ్‌గౌడ్, నాయకులు నందిమళ్ల అశోక్, కృష్ణ, నాగన్నయాదవ్, తిరుమల్, ప్రేమ్‌నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, పాషా, అలీం, శివ, భరత్ పాల్గొన్నారు.