BRS | మహబూబ్‌నగర్, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గులాబీ పార్టీ నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తున్నది. ప్రగతి ప్రదాత, ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ రెండు సార్లు పర్యటించారు. 6వ తేదీన నాగర్‌కర్నూల్, 12న జోగుళాంబ గద్వాల జిల్లాకు వచ్చారు. ఆయా జిల్లా కేంద్రాల్లోని నూతన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల భవనాలను, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో పాలనను ప్రజలకు మరింత చేరువ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న వేళ సీఎం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. అలాగే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సైతం ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
మహబూబ్‌నగర్, జడ్చర్ల, అచ్చంపేట, దేవరకద్ర నియోజకవర్గాల్లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముఖ్య నాయకుల పర్యటనతో క్యాడర్లో ఉత్సాహం కనిపిస్తున్నది. రెండు ప్రాంతాల్లోని సీఎం సభలకు జనం ఊహించిన దానికంటే ఎక్కువగా తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా లక్షల సంఖ్యలో జనం రావడంతో సీఎం కేసీఆర్ అంటే వారికి ఎంత అభిమానం ఉందో ఆ ప్రభంజనాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇసుకేసినా రాలనంత జనం ఉప్పొంగడంతో మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ అభినందించారు. మంత్రు లు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కలిసికట్టుగా జనసమీకరణ చేపట్టారు. దీంతో పార్టీ నేతలు ఉబ్బితబ్బిపోతున్నారు. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో అధినేతల సుడిగాలి పర్యటనలు ఎన్నికల కోలాహలాన్ని తలపించాయి. రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను మరోసారి భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని వారు కోరారు. కాగా వీరి పర్యటనలు విపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేశాయి.
ఉమ్మడి జిల్లాపై సీఎం మమకారం
కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించి.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తొలి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. అంతేగాక జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో పీఆర్ఎల్ కింద అన్ని రిజర్వాయర్లు నింపాలని ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించిండంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. అధికారులు పర్యవేక్షణ చేపట్టి ముమ్మరంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
నాగర్‌కర్నూల్ సభలో జజ్జనకరి ‘జనా’లే..
6వ తేదీన నాగర్‌కర్నూల్‌కు సీఎం కేసీఆర్ వచ్చారు. కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు ‘లక్ష’ణంగా ప్రజలు తరలివచ్చారు. ‘న భూతో.. నా భవిష్యత్’.. అన్న రీతిలో ఎక్కడ చూసినా జజ్జనకరి జనాలే కనిపించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి జనసమీకరణలో పోటీ పడ్డారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి సుమారు 900 డీసీఎంలలో జనాన్ని తరలించారు. దీంతో సభకు ఊహించని రీతిలో లక్ష వరకు పోటెత్తారు. సీఎం కేసీఆర్‌ను చూసేందుకు వచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వస్తుంటే జననేత కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి సభలో మాట్లాడుతూ విపక్షాలపై పదునైన విమర్శలు గు ప్పించారు. తాను మాట్లాడిన మాటలను గ్రామా ల్లో చర్చకు పెట్టాలని జనానికి సూచించారు.
నడిగడ్డ నీరా‘జనం’
జోగుళాంబ గద్వాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు ప్రజలు నీరాజనం పలికారు. జిల్లాలో రాజకీయ ఉద్దండులు ఉంటారని పచ్చమీడియా ప్రచారాన్ని పీక్ స్థాయికి తీసుకుపోయింది. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ నడిగడ్డ జనం కేసీఆర్‌కు జై కొట్టారు. 12న గద్వాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ జేజమ్మ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, చల్లా వెంకట్రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ సరిత, ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథం భారీగా జనసమీకరణ చేశారు.
పోటాపోటీగా జన సమీకరణ చేపట్టడంతో 80 వేల మంది సభకు తరలివచ్చారు. సీఎం కేసీఆర్ ప్రసంగానికి జనం జేజేలు పలికారు. గద్వాల జిల్లాకు ప్రగతి ప్రదాత వరాల జల్లు కురిపించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.125 కోట్లు, ప్రతి పంచాయతీకి రూ. 10 లక్షలు ప్రకటించారు. ఈ జిల్లాలో అడ్డం, పొడుగు మాట్లాడేటోళ్లు చాలామంది ఉన్నారని, డీకే అరుణను పరోక్షంగా విమర్శించారు. వెనుకబడిన జిల్లాలో రాజభవనాల్లాంటి పరిపాలనా కాంప్లెక్స్‌లు నిర్మించామని సీఎం తెలిపారు. నాటి ఉద్యమ కాలంలో నడిగడ్డ పడ్డ బాధలను గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక నడిగడ్డ స్వరూపమే మారిందని అంకెలతో సహా వివరించారు. నాగర్‌కర్నూల్, గద్వాల బహిరంగ సభలు సక్సెస్ కావడంతో బీఆర్ఎస్లో ఉత్సాహం పెరిగింది.
ప్రగతికి పెద్దపీట వేసిన మంత్రులు
ప్రగతి రథసారుథులైన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సుడిగాలి పర్యటనలు చేసి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సుమారు రూ.పది వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న అమరరాజ బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన చేశారు. దేవరకద్ర మండలం మూసాపేట మండలం వేముల వద్ద రూ.500 కోట్లతో నిర్మించనున్న ఎస్జీడీ కార్నింగ్ కంపెనీ యూనిట్-2కు మంత్రి శంకుస్థాపన చేశారు. వలసలకు నిలయమైన పాలమూరు పేరు తుడిచి పెట్టుకుపోతుందని చెప్పడానికి పరిశ్రమలే నిదర్శనమన్నారు.
కాగా మరో వైపు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పలు చోట్ల దవాఖానలు ప్రారంభించి పేదల చెంతకు కార్పొరేట్ వైద్యానికి తీసుకొచ్చారు. జడ్చర్ల, అచ్చంపేటలో వంద పడకల వైద్యశాలను ప్రారంభించి బహిరంగ సభల్లో మాట్లాడారు. జిల్లా వెనుకబాటు తనానికి కారణం ఎవరు అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఉమ్మడి జిల్లా ను సస్యశ్యామలం చేస్తారని భరోసానిచ్చా రు. గులాబీ పార్టీని మరోసారి ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రులు ప్రజలకు పిలుపునిచ్చారు. సిట్టింగ్‌లకు టికెట్లు రావనే ఊహగానాలకు తెరదించారు. పచ్చమీడియా రాతలకు చెక్‌పెట్టారు.
కాంగ్రెస్, బీజేపీకి ఝలక్
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలకుగానూ 13 నియోజకవర్గంలో కారు దూసుకెళ్లింది. తర్వాత కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్‌రెడ్డి గులాబీ పార్టీలో చేరడంతో మొత్తం స్థానాలు కారును కైవసం చేసుకున్నది. వచ్చే ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లా జనం బీఆర్ఎస్కు జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉనికిని కాపాడుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మార్చ్‌ల పేరిట యాత్రలు చేపట్టారు. రెండు పార్టీల నాయకులు ఎక్కడకు వెళ్లినా జనం రాకపోవడంతో ఖంగుతిన్నారు. నిరుద్యోగులను ఉసిగొల్పడానికి చేపట్టిన నిరుద్యోగ మార్చ్, నిరుద్యోగ ర్యాలీలు భరోసా కల్పించేలేకపోయాయి.
పాదయాత్రలూ తుస్సు మనడంతో అంతర్మథనంలో పడ్డారు. పా ర్టీలో వర్గ పోరు.. ఉన్న కొద్ది మంది నేతలు ఆధిపత్య పోరు ప్రదర్శించడంతో వారికి భంగపాటు తప్పలేదు. ఎక్కడకు వెళ్లినా జనం రాకపోవడంతో నిట్టూర్చారు. రేవంత్ ఏకంగా తనకు తాను గొప్పలు చెప్పుకోవడంతో బీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగారు. దీంతో ఈ వ్యూహం అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఓటుకు నోటు కేసులో ఓ దొంగకు పార్టీ పగ్గాలు అప్పగించారని.. ఓటు వేస్తే శంకరగిరి మాన్యాలే అని కేటీఆర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రేవంత్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు వ్యక్తిగతంగా వాళ్ల పార్టీ నేతలను కలిస్తే.. పార్టీలు మారుతున్నారంటూ కొత్త ప్రచారానికి తెరలేపా రు.
ఇలాంటి చీప్‌ట్రిక్స్‌కు కూడా బీఆర్ఎస్ నేతలు చెక్ పెట్టడంతో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ‘కుడితిలో పడ్డ ఎలుకలా’ మారింది. కాగా కమలం పార్టీలోకి వచ్చినా తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉన్నదని భావించిన డీకే అరుణ, జితేందర్‌రెడ్డి సొంత గూటికి వెళ్లాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక వనపర్తిలో కొందరు స్వార్థపరుల మాటలు విని పార్టీకి రాజీనామా చేసి న జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి చివరికి తప్పు తెలుసుకుని సొంత గూటికి చేరారు. మొత్తంపై బీ ఆర్ఎస్ అధినేతల పర్యటనలతో ఉమ్మడి జిల్లాలో అప్పుడే ఎన్నికల కోలాహలం మొదలైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
భరోసానివ్వని ‘మార్చ్’లు
ఇది ఇలా ఉండగా నిరుద్యోగ మార్చ్, నిరుద్యోగ నిరసన ర్యాలీ, పీపుల్స్ మార్చ్ పేరిట కాంగ్రెస్ నేతలు చేపట్టిన యాత్రలు, పాదయాత్రలు జనం లేక వెలవెలబోయింది. ఈ సభల్లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రలు ఇటు నిరుద్యోగులను, అటు సొంత పార్టీ నేతల్లో భరోసానివ్వలేదు. తామే గొప్పోళ్లమని సొంత డబ్బాలకు పోవడం, మంత్రులు, ఎమ్మెల్యేలపై చేసిన అర్ధరహిత ఆరోపణలు రివర్స్ అయ్యాయి. సొంత పార్టీ నేతలే రేవంత్ మాటలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల రోజుల నుంచి బీఆర్ఎస్ అగ్రనేతలు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఉమ్మడి పాలమూరు జిల్లాను టార్గెట్ చేస్తూ పర్యటనలు చేపట్టడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పర్యటనలు ప్రాధా న్యత సంతరించుకున్నాయి.