మాగనూరు : అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటే అంతుచూస్తామని బెదిరించిన ఇసుక మాఫియా ( Sand Mafia ) పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కృష్ణా పోలీసులకు ఫిర్యాదు ( Complaint ) చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువ నాయకులు శివరాజ్ పటేల్ ( Shivaraj Patel ) మీడియాతో మాట్లాడుతూ కృష్ణా మండలంలోని గురుజాల్, వాసునగర్, టైరోడ్ మూడుమాల్ సమీపంలోని కృష్ణానదిలో రాత్రి వేళల్లో అక్రమంగా పెద్ద ఎత్తున ఇసుక తరలింపు నిత్యం జోరుగా కొనసాగుతుందని ఆరోపించారు.
పోలీస్, రెవెన్యూ అధికారుల అండదండలతో ఈ వ్యవహారం కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఓ మంత్రి అండదండలతో నిత్యం 50 నుంచి 100 ట్రిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక కర్ణాటకకు తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అక్రమ ఇసుకను అడ్డుకున్న వారిని ఇసుక మాఫియా బెదిరించడంతో పాటు భౌతిక దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కి కూడా ఫిర్యాదు చేశామని శివరాజ్ పటేల్ వెల్లడించారు.