గోపాల్పేట, సెప్టెంబర్ 27 : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొర్రీలు లేకుండా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా అమలు చేయాలని రేవల్లి తాసీల్దార్ కార్యాలయం, యూనియన్ బ్యాంక్ ఎదుట శుక్రవారం బీఆర్ఎస్ నేతలు రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘురామారావు, మాజీ ఎంపీపీ సేనాపతి, జెడ్పీటీసీ భీమన్న మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రజలకు అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. నేడు వాటిని నెరవేర్చలేక కాలయాపన చేస్తుందని మండిపడ్డారు.
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారన్నారు. వానకాలం ముగుస్తున్నా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని, పెట్టుబడి కోసం మళ్లీ షావుకారులను ఆశ్రయించే స్థితికి అన్నదాతలు చేరుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పనులు మంజూరు చేయకపోగా.. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పనులకు ఆటంకాలు కలిగిస్తున్నదని, తాము ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం తగదన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు చిల్లర చేష్టలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. అనంతరం తాసీల్దార్ లక్ష్మీదేవి, యూనియన్ బ్యాంక్ మేనేజర్ నూర్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్‌యాదవ్, సునీల్ కుమార్, జగదీశ్, తిరుపతి, కురుమత్రెడ్డి, శ్రీశైలం, రాములు, శివరాంరెడ్డి, అబ్ధుల్ మహమూద్, సురేందర్‌రెడ్డి, సురేశ్, శంకర్‌రెడ్డి, స్వామిరెడ్డి, రవిఆచారి, సుధాకర్‌రెడ్డి, అబ్బాస్, నిరంజన్, కో ఆప్షన్ సభ్యుడు ఖాజా, రైతులు పాల్గొన్నారు.