లింగాల, ఫిబ్రవరి 23 : అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రాజకీయంగా ఎదుర్కొలేకే ఆస్తుల కూల్చివేతలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కేటీ తిరుపతయ్య, సింగిల్ విండో చైర్మన్ హన్మంత్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని అంబట్పల్లిలో శనివారం తెల్లవారు జామున సింగిల్ విండో చైర్మన్ హన్మంత్‌రెడ్డి నిర్మించుకున్న ప్రహరీని కూల్చివేయడంపై ఆదివారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు కేటీ తిరుపతయ్య, సింగిల్ విండో చైర్మన్ హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ సింగిల్ విండో మాజీ చైర్మన్ జంబుల వెంకట్‌రెడ్డి పేరుపై 50ఏండ్ల కిందట 732సర్వే నెంబరులో 0.20గుంటల భూమి కొనుగోలు చేసినట్లు అన్ని పత్రాలు ఉన్నాయన్నారు.
ప్రహరీ కూల్చివేస్తున్నట్లు ఎలాంటి నోటిసులు ఇవ్వకుండా స్థానిక నాయకులు ప్రోద్భలంతో ఎమ్మెల్యే, మంత్రుల ఒత్తిడి వల్ల రెవెన్యూ అధికారులు పోలీస్‌శాఖ రాత్రికి రాత్రే వచ్చి కూల్చివేయడం ఎంటని ప్రశ్నించారు. ప్రతిపక్షా హోదాలో ఉంటూ ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడడమే కాకుండా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిస్తున్నారని ఆరోపించారు.
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఇలాంటి దాడులకు పాల్పడలేదని ఎన్నికల వరకు మాత్రమే పార్టీలకు పని చేసి ఎన్నికలు ముగిశాక పార్టీలకు అతీతంగా కలిసి మెలిసి మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరికీ పథకాలు అందే విధంగా కృషి చేశామని అన్నారు. అధికారం ఎప్పటికి శాశ్వతం కాదని వచ్చే నాలుగేండ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కార్యకర్తలు భయబ్రాంతులకు గురి కాకుండా ఎదురు తిరిగి పోరాడి నిలబడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసులు, నర్సింహ, జయంత్‌రెడ్డి, హన్మంతునాయక్, మోహన్‌రెడ్డి, పర్వతాలు, బీజేపీ నాయకులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.