మక్తల్, ఏప్రిల్ 15 : మక్తల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇవ్వాల్సిన గన్ని బ్యాగులలో భారీ మొత్తంలో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ మక్తల్ నియోజకవర్గ యువజన విభాగం నాయకులు గవినోల నరసింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రబీ సీజన్లో వరి పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునేందుకు రైతులు మక్తల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి వెళ్తే గన్ని బ్యాగులు ఇవ్వకుండగా రైతులను ఇబ్బందుల పాలు చేయడం ఎంతవరకు సమంజసం…? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద ఆయా క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు పండించిన వడ్లను పరిశీలించి తేమ శాతం ప్రకారంగా ఏ రోజు కొనుగోలు కేంద్రానికి రైతు ధాన్యాన్ని తీసుకురావాలనే విషయాన్ని వ్యవసాయ విస్తరణ అధికారి రైతుకు టోకెన్లు అందజేసి ఖచ్చితమైన తేదీని రైతుకు చెప్పడం తో పాటు రైతుకు అవసరమైన గన్ని బ్యాగులను ఇవ్వాల్సి ఉందన్నారు.
కానీ ఎందుకు విరుద్ధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని సిబ్బంది, తమకు ఇష్టం వచ్చిన రైతులకు ఇష్టం వచ్చిన రీతిలో గన్ని బ్యాగులను పంపిణీ చేసి, సామాన్య రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు గురిచేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. రైతులు పండించిన వరి పంట కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాల్సిన తేదీలను క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ అధికారులు ధాన్యాన్ని పరిశీలించి రైతన్నలకు టోకెన్లు జారీ చేసి ఎన్ని బ్యాగులను అందించాలని లేనిపక్షంలో భారత రాష్ట్ర సమితి తరపున రైతులకు న్యాయం జరిగేంతవరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.