గద్వాల, మార్చి14 : స్పష్టమైన కారణం లేకుండా ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం హేయమైన చర్యగా గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నేత బాసు హనుమంతు నాయుడు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గద్వాల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గులాబీ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా హనుమంతు మాట్లాడుతూ మాటల్లో ఎటువంటి తప్పిదాలు లేకున్నా స్పీకర్ ఉద్దేశ్యపూర్వకంగా ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు.
ప్రశాంతంగా దిష్టిబొమ్మ దహనం చేస్తామని చెప్పినా పోలీసులు మా నిరసనకు అనుమతి ఇవ్వకుండా అడ్డుపడ్డారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పేరుకేమో ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రజల తరపున మాట్లాడే వారి గొంతునొక్కడం ఏమిటని ప్రశ్నించారు. శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ నిరాధరణ ఆరోపణలతో ఆయన్ను సస్పెండ్ చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు మోనేశ్, బీచుపల్లి, రాజు, శ్రీరాములు, తిరుమలేశ్, తిమ్మప్పగౌడ్, ఆటో మగ్బూల్, మౌర్య, వసుంధర, రమేశ్, గంగాధర్, ఆంజనేయులు, ఇమ్మానియల్, అనిల్, కామేశ్ తదితరులు పాల్గొన్నారు.