మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యమమే ఊపిరిగా.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి.. పదేండ్ల పాలనలో దేశమే ఆశ్చర్యపోయేలా అభివృద్ధిని సాధించిన బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ పండుగ వేడుకకు ఉమ్మడి పాలమూరు సంసిద్ధమైంది. ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవానికి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివెళ్లనున్నారు. పార్టీ ఇచ్చిన పిలుపుతో ఇప్పటికే పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో వాల్‌రైటింగ్, జెండాల రెపరెపలతో గులాబీమయంగా మారాయి.
మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి భారీగా తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్ రెడ్డి, వాణీదేవి, గోరటి వెంకన్న, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి పార్టీ శ్రేణులు తరలివెళ్లేందుకు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. వాహనాలు, భోజన వసతి కల్పిస్తున్నారు. అలంపూర్, గద్వాల, కొల్లాపూర్, అచ్చంపేట, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు శనివారం అర్ధరాత్రి నుంచే వరంగల్ సభకు బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
కేసీఆర్ కావాలనే డిమాండ్లు
తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ మొక్కవోని దీక్షతో సాధించిన తెలంగాణను పదేండ్లలో ఊహించని అభివృద్ధిని సాధించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలను నమ్మిన ప్రజలు అధికారం కట్టబెట్టగా, 15 నెలల్లోనే అసమర్థ పాలన బట్టబయలైంది. దీంతో మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ స్థాపించి 25ఏండ్లు అవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న సభకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ చారిత్రాత్మక సభకు తరలివెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. భగభగ మండే ఎండలను సైతం లెక్కచేయకుండా బయలుదేరి వెళ్తున్నారు.
వరంగల్ సభలో ఉమ్మడి జిల్లా మార్క్
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కేసీఆర్‌ను అక్కున చేర్చుకున్నది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా. పార్టీ ఆవిర్భావం నుంచి రజతోత్సవం వరకు కేసీఆర్ వెంటే జనం ఉన్నారు. 25 ఏండ్ల ఆవిర్భావ పండుగకు నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగింది. మరోసారి ఉమ్మడి జిల్లా మార్క్‌ను సభలో చాటిచెప్పేందుకు ఉవ్విళ్లురుతున్నారు.
రజతోత్సాహం
బీఆర్ఎస్ 25ఏండ్ల పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గులాబీ జోష్ నెలకొన్నది. ఒకరోజు ముందు నుంచే రజతోత్సవ ఉత్సవాలు ప్రారంభించారు. మహబూబ్‌గర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన గులాబీ జెండా ఆవిష్కరణ చేశారు. బీఆర్ఎస్ జిందాబాద్.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.