జడ్చర్ల : పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కంటే బీఆర్ఎస్( BRS) ఎక్కువ సీట్లు గెలిచిందని మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ( Lakshma Reddy ) అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించి,శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాబోయేది కేసీఆర్( KCR ) ప్రభుత్వమేనని నమ్మి ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టారని తెలిపారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో గ్రామాలకు నిధులు ఇవ్వలేదని,బీఆర్ఎస్ హయంలో చేసిన అభివృద్ధి పనులు కొనసాగించడంలో విఫలమైందని ఆరోపించారు. గ్రామాలకు రావాల్సిన నిధులు ఎవ్వరు ఆపలేరని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్లను కాంగ్రెస్లోకి రావాలని ప్రలోభాలకు గురి చేస్తున్నా, ఎవరూ కూడా వెళ్లడం లేదని వెల్లడించారు.
కాంగ్రెస్ ఇండిపెండెంట్లను వారి ఖాతాలో వేసుకుంటుందని విమర్శించారు. జడ్చర్ల నియోజకవర్గంలో గెలిచిన ఇండిపెండెంట్లకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని తెలిపారు. కేసీఆర్ హయంలో గ్రామాల అభివృద్ధిని చూసి కేంద్ర సంస్థల అవార్డులు తెలంగాణకు వచ్చాయని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయని అయినప్పటికీ రాష్ట్రంలో నలభై శాతం సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని తెలిపారు.
మొదటి విడత దెబ్బకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామ గ్రామాన తిరిగినా బీఆర్ఎస్ సర్పంచులే గెలుపొందారని లక్ష్మారెడ్డి అన్నారు. పోలీస్, పవర్, పైసలు వాడినా కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పారు. సర్పంచ్ ఎన్నికలకు సీఎం ప్రచారం చేసినా జనాలు పట్టించుకోలేదు. కాంగ్రెస్లోకి ఎవరిని రానివ్వనని ఢాంబికాలు పలికినా ఎమ్మెల్యే ఇప్పుడేమో ఎవరోస్తరా అని ఎదురుచూస్తున్నాడని విమర్శించారు.