కొల్లాపూర్, నవంబర్ 19 : 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో చేసుకున్నాం. తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం. నాకు మరోసారి అవకాశమిస్తే కొల్లాపూర్ నియోజకవర్గం రూపురేఖలు మారుస్తాను. రేపు జరగబోయే ఎన్నికలు ఓ వ్యక్తి అహంకారానికి, కొల్లాపూర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా అన్యాయంగా, అక్రమంగా సంపాదించిన డబ్బుతో మన నాయకులను కొంటున్నారు. ఎంతమందిని కొన్నా ప్రజలంతా మావెంటే ఉన్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలి. మన ప్రాంత అభివృద్ధి గురించి మనకన్నా ముఖ్యమంత్రికి బాగా తెలుసు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించిన సీఎం కేసీఆర్కు నా ధన్యవాదాలు.
శ్రీశైలం నిర్వాసితులు 300మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం గారికే దక్కింది. కొల్లాపూర్ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ప్రత్యర్థులు అక్రమంగా సంపాదించిన డబ్బుల బలంతో, మాయమాటలు చెప్పి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని నమ్మకండి. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ పనిచేస్తా. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం కాబోతున్నారని, ముందస్తుగా మనంతా చప్పట్లు, హర్షాధ్వానాలు చేయాలి. కొల్లాపూర్లో ఇంజినీరింగ్ కాలేజీ, మామిడి ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ను కోరుతున్నాను.