అయిజ, ఫిబ్రవరి 13 : అయిజ మున్సిపాలిటీని మరో సారి బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పట్టణ ఓటర్లు ఆదరించారు. 20 వార్డులకుగానూ 13 స్థానాలను కట్టబెట్టి పట్టం కట్టారు. రాష్ట్రంలోనే ముందుగానే బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పార్టీ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేశారు. దీంతో కాంగ్రెస్ కేవలం 7 వార్డులకే పరిమితమైంది. ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ అయిజను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినా ఇక్కడి ఓటర్లు తిరస్కరించారు. 2014, 2020లో అధికారం కట్టబెట్టిన ఓటర్లు మూడోసారి కారు పార్టీని గెలిపించి మాజీ సీఎం కేసీఆర్కు బహుమానంగా అందించారు.
అయిజ మున్సిపాలిటీలో గెలుపొందిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సీఎం సురేశ్ ఆధ్వర్యంలో 12 మంది వార్డు సభ్యులు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం కర్నూల్లోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అభ్యర్థులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.