మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నడిగడ్డలో బీఆర్ఎస్ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. అలంపూర్, అయిజ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో బీజేపీ స్నేహపూర్వక మద్దతుతో చైర్మన్ పీఠం బీఆర్ఎస్కు వరిస్తుండగా మంత్రి వాకిటి శ్రీహరి దౌర్జన్యంగా పోలీసుల అండతో అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి బెదిరించడంతో ఒక్క ఓటుతో చేజారింది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థికి చైర్మన్ పదవి ఇస్తున్నట్లు సాక్షాత్తు మంత్రి కౌన్సిల్లో ప్రకటించడం కలకలం రేగింది.
ఆ తర్వాత మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన జింక సువర్ణకు కాంగ్రెస్ కండువా కప్పి అనైతికంగా అధికార పార్టీ తన ఖాతాలో వేసుకున్నది. మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో మేయర్ పదవి ఆశించిన కార్పొరేటర్ భర్త ఆనంద్‌గౌడ్‌ను సోమవారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల నుంచి క్యాంప్‌ను శంషాబాద్ రిసార్ట్‌కు మార్చారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక విషయంలో తీవ్ర వాగ్వాదం జరగడంతో తెల్లవారుజామున కార్పొరేటర్లు బసచేస్తున్న రిసార్ట్‌పై పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.
చివరకు పీసీసీ అధ్యక్షుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం. నారాయణపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇద్దరు ఎన్నికను బహిష్కరించారు. మద్దూరులో అధికార పార్టీ చైర్మన్ ఎంపిక విషయంలో రెండు వర్గా లు పోటాపోటీగా ఆందోళనకు దిగాయి. చైర్మన్ పదవి ఇవ్వకపోవడంతో ఒక వర్గం రోడ్డు ఎక్కి ధర్నాకు దిగడంతో పోలీసులు బలవంతంగా వారిని లాక్కెళ్లారు. వనపర్తి మున్సిపాలిటీలో చైర్మన్ పదవి ఇస్తామని ఆశచూపి ఇతరులకు ఇవ్వడంతో కాంగ్రెస్ కౌన్సిలర్ రాజీనామా అందజేశారు.
గద్వాలలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అనుచర వర్గానికి కాంగ్రెస్ తరఫున చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కాయి. సోమవారం ఉమ్మడి జిల్లాలో జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇటు మున్సిపల్, అటు పోలీస్ అధికారులు అధికార పార్టీకి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అమరచింతలో క్యాంప్ నుంచి నేరుగా కౌన్సిల్ కార్యాలయానికి చేరుకోవడంతో పోలీసులు దగ్గరుండి బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను మంత్రితో మాట్లాడించి ప్యాకేజీ ఇప్పించడం.. బీఆర్ఎస్ ఖాతాలో రావాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ పదవి అధికార పార్టీకి అప్పజెప్పడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సహనం కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పోలీస్ అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గందరగోళం మధ్య చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక
ఎన్నికల్లో పదవులు ఇస్తామని ఆశచూపి మెజార్టీ వచ్చాక అధికార పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ నేతలకి హ్యాండ్ ఇచ్చిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. వనపర్తి జిల్లాకేంద్రంలో మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి మాట తప్పారు. దీంతో వనపర్తి మున్సిపల్ చైర్మన్ విషయంలో బీసీలకు అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు చీర్ల విజయచందర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అంతేకాకుండా 3వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన చీర్ల రజిని ము న్సిపల్ కమిషనర్‌కు రాజీనామా లేఖను అందజేశారు. అధికార పార్టీ తీరుతో నారాయణపేట మున్సిపల్ కౌన్సిల్లో జరుగుతున్న సమావేశానికి ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గం మద్దూరు మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌లో వర్గ విభేదాలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నా విరమించారు. గందరగోళం మధ్యన చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక నిర్వహించారు.
అమరచింతలో మంత్రి డైరెక్షన్లో..
మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గంలో మెజార్టీ లేకుండా చివరి నిమిషంలో పోలీసుల సహకారంతో మున్సిపల్ కౌన్సిల్లోనే భేరసారాలకు దిగారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 స్థానాలకు కాంగ్రెస్ మూడు, బీఆర్ఎస్ మూడు, బీజేపీ మూడు, సీపీఎం ఒక వార్డులను గెలుచుకున్నాయి. అయితే బీఆర్ఎస్తో బీజేపీ స్నేహపూర్వక ఒప్పందానికి వచ్చింది. దీంతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లను క్యాంప్‌నకు తరలించారు. అనూహ్యంగా క్యాంప్ నుంచి వచ్చేటప్పుడు ఓ బీఆర్ఎస్ కౌన్సిలర్‌కు గాలం వేశారు. అప్పటికే అమరచింతలో ఎక్స్‌ఆఫిషియో ఓటును నమోదు చేసుకున్న మంత్రి శ్రీహరి ఆదేశాలతో పోలీసులు ఓ వార్డు సభ్యురాలు భర్తతో తనకు ప్రాణహాని ఉందని చెప్పి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ లోగా మంత్రి శ్రీహరి కౌన్సిల్ సమావేశానికి రావడం లోప లే ఒక అధికారి సదరు కౌన్సిలర్ భర్త ఫోన్ మాట్లాడించి దగ్గరుండి ప్యాకేజీ మాట్లాడుకున్నారు. మంత్రి సమక్షంలోని ఇదంతా జరిగింది. పోలీసులు అధికార యంత్రాంగం సహకరించడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ జింక సువర్ణను చైర్పర్సన్ పదవికి మంత్రి శ్రీహరి నామినేట్ చేశారు. అప్పటికే బీఆర్ఎస్ విప్ జారీ చేసింది. దీంతో తెలివిగా మంత్రి శ్రీహరి బీఆర్ఎస్కు చెందిన సువర్ణను చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గందరగోళం నెలకొన్నది.. చివరకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కాగానే బయటికి వచ్చి చైర్పర్సన్ మెడలో కాంగ్రెస్ కండువా వేసి కాంగ్రెస్ ఖాతాలోకి కలుపుకొన్నారు. ఈ అనైతిక చర్యలపై మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు డ్యూటీలు మాని మంత్రి ఇంట్లో పని చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలంపూర్, అయిజలో ఎగిరిన గులాబీ జెండా
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలో రెండింటిని బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకున్నది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు చక్రం తిప్పడంతో అలంపూర్, అయిజ రెండు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ వశమయ్యాయి. అలంపూర్ చైర్మన్‌గా పి. జయ రాములు, వైస్ చైర్మన్‌గా బి. విక్రమ్‌ను ఎన్నుకున్నారు. ఇక్కడే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎక్స్‌ఆఫిషియో ఓటును నమోదు చేసుకున్నారు. 10 వార్డులకు గానూ ఐదు బీఆర్ఎస్కు, ఐదు కాంగ్రెస్‌కు వచ్చాయి. అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓటుతో కలిపి బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్లు దాటింది. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక సజావుగా సాగింది. ఇక అయిజలో మున్సిపల్ చైర్మన్‌గా సీఎం సురేశ్, వైస్ చైర్మన్‌గా ఎం.నరసింహులును ఎన్నుకున్నారు.
ఈ మున్సిపాలిటీలో మొత్తం 20వార్డు స్థానాలకు గానూ బీఆర్ఎస్ 13చోట్ల గెలిచింది. మ్యాజిక్ ఫిగర్‌కు దాటడంతో దీన్ని కూడా బీఆర్ఎస్ ఖాతాలోకి వేసుకున్నది. ఇక ఇదే నియోజ కవర్గం వడ్డేపల్లి మున్సిపా లిటీలో ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకోగా.. వీరందరినీ సాక్షాత్తు సీఎం దగ్గరికి తీసుకెళ్లి కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రకటించారు. సీ ఎం సమక్షంలో చేరినట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటించినా ఫార్వర్డ్ బ్లాక్ నేత శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ తాము కాంగ్రెస్‌లో చేరలేదని.. కేవలం సీఎంను కలిశామని.. ఫార్వర్డ్ బ్లాక్‌లోనే ఉంటామన్న ప్రకటనతో కాంగ్రెస్ షాక్ తిన్నది.
ఊహించని రీతిలో కార్పొరేషన్ మేయర్ ఎన్నిక..
నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేటర్లుగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. బీఆర్ఎస్కు చెందిన 16మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవి, స్థానిక సంస్థల కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీవో నవీన్, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సమక్షంలో జరిగింది. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా గుమాల్ మమత, డిప్యూటీ మేయర్‌గా మారేపల్లి సురేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాగా అధికార పార్టీలో ఊహించని రీతి లో మేయర్ ఎంపిక జరగడంతో ఒక వర్గం తీవ్ర అసంతృప్తికి లోనైంది. మరోవైపు మేయర్‌గా బీసీ మహిళకు చాన్స్ ఇచ్చి.. మైనారిటీలకు డిప్యూటీ మేయర్ ఇస్తారని భావించిన రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడంతో కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి రేగుతోంది. అయితే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాత్రం కార్పొరేషన్ అభివృద్ధికి పార్టీలకతీతంగా పాటుపడతామని.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం కావడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖఆ్యనించారు. మొత్తంపై ఉమ్మడి జిల్లాలో చావుతప్పి కన్నులొట్టపోయిన విధంగా అధికార పార్టీ అనేక ఆపసోపాలు పడి మున్సిపాలిటీలను దక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ నేతలపై కూడా నిఘా పెట్టి పోలీస్, మున్సిపల్ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవడం గమనార్హం.