ఊట్కూర్ : క్రీడలతో విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని బిజ్వారం అంబత్రయ క్షేత్రం వ్యవస్థాపకులు ఆదిత్య పరాశ్రీ స్వామిజీ ( Aditya Parashri Swamiji ) అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలోని అంబత్రయ క్షేత్రం శక్తిపీఠం మైదానంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల షూటింగ్ బాల్ ( Shooting Ball ) పోటీలను స్వామిజీ ప్రారంభించారు. పోటీలకు హాజరైన నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లా బాలికల జట్ల క్రీడాకారిణులను పరిచయం చేసుకొన్నారు.
ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి అంబత్రయ క్షేత్రం కృషి చేస్తుందని, క్రీడలకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. బాల బాలికలను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్న విశ్రాంత పీఈటీ గోపాలం, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. షూటింగ్ బాల్ క్రీడా నిర్వాహకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. ఐలయ్య, ఉపాధ్యక్షుడు బి.గోపాలం మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ క్రీడా పోటీల్లో 22 మంది బాలురు, 20 మంది బాలికల జట్లు పాల్గొననున్నట్లు తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు మే నెల 9 నుంచి 11 వరకు చెన్నైలో జరుగు జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో షూటింగ్ బాల్ క్రీడా విభాగం నారాయణపేట జిల్లా అధ్యక్షుడు సత్య ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, బి. పవన్, శ్రీనాథ్, రాఘవేందర్, మంజునాథ్ ,సాయి కుమార్, వర్మ, వాకిటి శివకుమార్, వెంకటేష్ గౌడ్ ,అశోక్ , నరసింహ పాల్గొన్నారు.