మూసాపేట(చిన్నచింతకుంట), అక్టోబర్ 28 : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కొలిచిన వారికి కొంగుబంగారంగా కురుమూర్తి రాయుడు పేరొందాడు. అంతటి మహిమాన్వితుడు.. ఏడుకొండల మధ్య కాంచనగుహలో కొలువుదీరిన స్వామిని భక్తులు కొలిచేందుకు వేళైంది. ఈ ఏడాది ఈనెల 31 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యత కలిగి ఈ జాతరకు తెలుగు రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
జాతరలో ప్రధానమైనది ఉద్దాలోత్సవం. ఇంటిదైవంగా భావించే భక్తులు దేశంలో ఎక్కడ ఉన్నా స్వామివారి ఉద్దాల ఉత్సవాలకు తప్పనిసరిగా కుటుంబ సమేతంగా వారం రోజుల ముందుగానే సొంతూళ్లకు చేరుకుంటారు. ఇండ్లను శుద్ధి చేసుకొని కుటుంబ సమేతంగా బండ్లు, వాహనాలపై లక్షల్లో తరలివస్తారు. స్వామివారిని కొలిచి, రాత్రి మొత్తం అక్కడే ఉండి స్వామి సన్నిధిలో బస (జాగారణ) చేస్తారు. అక్టోబర్ 31వ తేదీ నుంచి కురుమూర్తి స్వామి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. నవంబర్ 2న స్వామివారి కల్యాణోత్సవం, 6న స్వామివారి అలంకారోత్సవం, 8న ఉద్దాల ఊరేగింపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల ఊరేగింపే ప్రధాన ఘట్టం. పల్లమర్రి నుంచి చాటను ఊరేగింపుగా వడ్డేమాన్ వరకు తీసుకొస్తారు. అక్కడే నియమ నిష్టలతో తయారు చేసిన స్వామివారి పాదుకల(ఉద్దాల) ఊరేగింపు భారీ బందోబస్తు మధ్య ఆలయం వరకు కొనసాగడం ఆనవాయితీగా వస్తుంది. ఉద్దాల వేడుకకు ప్రజాప్రతినిధులతోపాటు లక్షల్లో భక్తులు తరలిరానున్నారు. ఏర్పాట్లపై ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు.
బ్రహోత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి కురుమూర్తి జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకద్ర, వనపర్తి, మరికల్, మక్తల్ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. కాగా, ఆలయ పరిసరాల్లో మత్తు పదార్థాలు అమ్మడం, జూదం ఆడడం నిషేధించినట్లు అధికారులు తెలిపారు.