మహబూబ్ నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) 134వ జయంతి వేడుకలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ కాంస్య విగ్రహానికి కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎంపీ డీకే అరుణ, ఉద్యోగ ఉపాధ్యాయ కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల ప్రతినిధులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటరానివారుగా పరిగణించబడే పేద కుటుంబంలో పుట్టినా ఎదురుచూపులు కాచుకుంటూ ఎదిగి వచ్చారన్నారు. సాంఘిక పరమైన ఆర్థికపరమైన అవమానాలతో నిరంతరం పోరాడుతూ స్వయంకృషితో పైకి వచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ విదేశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసి జాతి గర్వించే స్థాయికి ఎదిగారని కొనియాడారు.
ఉన్నతాధికార హోదాలు, ధనార్జన ఆయన కాళ్లకు బంధనాలు వేయలేకపోయాయని చెప్పారు. ఎన్నో ఉన్నత పదవులను సైతం తునప్రాయంగా త్యజించి తన జీవితాన్ని దళిత జాతుల ఉన్నతికి అంకితం చేసిన మహనీయుడు అని కొనియాడారు. భారతదేశ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ రచన సంఘ అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులు లభించడానికి, చట్టం ముందు అందరూ సమానులేనని చాటడానికి, అస్పృశ్యత నేరం అన్న అంశాన్ని చట్టబద్ధం చేయడానికి ఆయన చేసిన కృషి మూల కారణమని పేర్కొన్నారు. తరతరాలుగా మతం పేరుతో బూజు పట్టిన భావాలతో తోటి వారిని ముఖ్యంగా మహిళలను విచక్షణకు, అవమానాలకు, అన్యాయానికి, అత్యాచారాలకు గురి చేస్తున్న వ్యవస్థపై పోరాటంలో భాగంగా ఆయన హిందూ కోడ్ బిల్లును రూపొందించారన్నారు.
సామాజిక రుగ్మతలకు, మూఢ విశ్వాసాలకు కట్టుబడిన జాతిని విముక్తం చేసి ఆధునికత దిశగా సంస్కరణలు, శాసన బద్ధం చేయనీయకుండా ఎదురైన వ్యతిరేకతకు ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారని చెప్పారు. అంబేద్కర్ కోరింది ప్రజాస్వామిక పంథా, ఆశించింది ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం అన్నారు. నైతిక విలువలతో కూడిన శాంతియుత ప్రజాజీవనం స్వతంత్ర సమానత్వం ప్రాతిపాదికలుగా భారతీయ సమాజాన్ని పునర్ నిర్మించాలన్నదే ఆశయమని అన్నారు.
అంబేద్కర్ జీవితం సమకాలిక సమాజానికి, ముఖ్యంగా యువతరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాగా, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్, యుటీఎఫ్ బహుజన టీచర్స్ ఫెడరేషన్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, ఉపాధ్యాయ సంఘాలు సీపీఐ, సీపీఎం, వివిధ పార్టీల ప్రతినిధులు విద్యార్థి యువజన సంఘాలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.