 
                                                            కోడేరు, అక్టోబర్ 30 : మండలంలోని బావాయిపల్లి డ్యాం వాగులో బొలేరో వాహనం కొట్టుకుపోయిన ఘటన గురువారం చోటు చేసుకున్నది. వివరాలిలా. అచ్చంపేటకు చెందిన సైదులు అనే వ్యక్తి తన వాహనంలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు 800 లీటర్ల పాలను బొలెరో (ఆటో ట్రాలి)లో ప్రతి రోజూ ఉదయం తరలించి సరఫ రా చేసేవారు. రోజు వారీగా పెద్దకొత్తపల్లి నుంచి కోడేరు మండల తీగలపల్లికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో బావాయిపల్లి డ్యాం వాగు ఉన్నది. వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తుంది.
వాగుదాటే క్రమంలో బొలేరో వాహనం నీటి ఉధృతికి కొట్టుకుపోయి మిషన్ భగీరథ పథకం పైపులైన్‌కు తట్టుకొంది. ఈ విషయం గుర్తించిన రైతులు, గ్రామస్తులు ముందుగా డ్రైవర్ సైదులను కాపాడారు. నీటిలో తట్టుకున్న వాహనాన్ని జేసీబీ సాయంతో గంటపాటు శ్రమించి బయటకు లాగారు. నాలుగేండ్లుగా వరదలు వచ్చినప్పుడల్లా వాహనాలు కొట్టుకుపోయి ప్రమాదాలు జరుగుతుంటే పాలకులు, అధికారులకు పట్టడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని బ్రిడ్జి నిర్మాణ పనులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు.
 
                            