Reavnth Reddy | మరికల్, మార్చి 07: సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా రాష్ట్రంలోనే నంబర్‌వన్ చీటర్‌గా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ నాగురావ్ నామాజీ విమర్శించారు. శుక్రవారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు 420 హామీలు ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. అభివృద్ధి చేయడం చేతకాక కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదని అన్నారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు లేకపోతే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందని తెలిపారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావివర్గం ఉపాధ్యాయులు, పట్టభద్రులు బీజేపీకి పట్టం కట్టారని నాగురావ్ నామాజీ అన్నారు. ఈ తీర్పు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టులా ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డిది ఐరన్ లెగ్ అని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా పాలమూరు ఎంపీగా బీజేపీ గెలిచిందని, రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజ్‌గిరిలో బీజేపీ ఎంపీ గెలిచారని.. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నిజామాబాద్-కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించిందని తెలిపారు. టీడీపీలో కొనసాగిన రేవంత్ రెడ్డి తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేశాడని.. ఇప్పుడు కాంగ్రెస్‌లో కొనసాగుతూ దాన్ని కూడా భూస్థాపితం చేస్తాడేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. నారాయణపేట పర్యటనలో భాగంగా ఆయనపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు తగవని అన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ కాలు మోసి ప్రచారం చేసినా అక్కడ బీజేపీ విజయం సాధిస్తుందని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి నీటి బుడగల ఉందని నాగురావ్ నామాజీ అన్నారు. పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీకి చక్కర్లుకొడుతున్నాడే తప్ప నిధులు తీసుకురావడానికి ఢిల్లీకి వెళ్లడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయిస్తున్న ఎన్ఆర్ఈజీఎస్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారని, కూలీలకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గ్రామీణ సడక్ యువజన కింద ప్రతి పల్లెకు బీటీ రోడ్ వేసిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నది మోదీ కాదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్ధాంతాల కోసం పనిచేసే బీజేపీని విమర్శిస్తే ఎమ్మెల్సీ ఫలితాలు మేధావులు ఇచ్చిన తీర్పు చెంప చెల్లుమనేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు అదే తీర్పును పునరావృతం చేస్తారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని షాద్‌నగర్, జడ్చర్ల, గద్వాల్, మహబూబ్‌గర్ రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో అభివృద్ధి చేస్తుందని నాగురావ్ నామాజీ తెలిపారు. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ సర్వే పనులు పూర్తి కావడం జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు. కేంద్రం నిధులు కేటాయించకుంటే రాష్ట్రంలో అభివృద్ధి మనుగడ లేకుండా పోతుందని తెలిపారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నది కాంగ్రెస్ మంత్రులు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. నారాయణపేటలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనానికి కేంద్రం 66 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బీజేపీని విమర్శిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీజేపీని విమర్శించే ముందు రేవంత్ రెడ్డి తన స్థాయిని తెలుసుకోవాలని సూచించారు. పదవి ఆకాంక్షతో పూటకొక పార్టీ మారే రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించే స్థాయికి ఎదగలేదని అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కేంద్ర నిధులపై చర్చకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ సమావేశంలో నారాయణపేట జిల్లా బిజెపి అధికార ప్రతినిధి నర్సన్ గౌడ్, జిల్లా నాయకులు తిరుపతిరెడ్డి, భాస్కర్ రెడ్డి, మరికల్ మండల పార్టీ అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.