పాన్‌గల్, మార్చి 6: రైతులు యాసంగిలో సాగుచేసిన పంటలు ఎండిపోకుండా సాగునీరందించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అన్నారం సమీపంలో సాగునీరు అందక ఎండిన పంటలను మాజీ ఎమ్మెల్యే బీరం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంజీకేఎల్ఐ మేజర్ కెనాల్-4 కాల్వ ద్వారా పంట పొలాలకు వెళ్లే కాల్వకు సరిపడా నీరందక వరి, వేరుశనగ పంటలు ఉండిపోతున్నాయని, సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇరవై రోజుల కిందట అన్నారంలో సాగునీటి కోసం పార్టీలకతీతంగా రైతులు ప్రధాన రోడ్డుపై ధర్నా చేపడితే, పెండింగ్‌లో ఉన్న కాల్వకు మరమ్మతులు త్వరలో చేపట్టి సాగునీరందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయడంలేదని విమర్శించారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రైతులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆరోపించారు. కేవలం బీఆర్ఎస్ రైతులపై కేసులు పెట్టడం సిగ్గుచేటని, రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనలో ఏనాడూ పంటలెండింది, తాగునీటికి కరువన్నదిలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరులేక పంటలెండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులతోపాటు అన్నివర్గాల ప్రజలకు మేలు జరగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలం చెందిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య నాయుడు, మాజీ సర్పంచులు మేస్త్రీ రాములు, బాలస్వామి, ఉపసర్పంచ్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వీరసాగర్, కురుమూర్తి, నవీన్‌రెడ్డి, రమేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.