కోడేరు, జూలై 11 : బీఆర్ఎస్ పార్టీకీ కార్యకర్తలే పట్టుగొమ్మలని.. కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాగులపల్లిలో కోడేరు మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన శుక్రవారం హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో కోడేరు మండలంలో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. మండల కేంద్రంలో సీసీరోడ్డు, ముత్తిరెడ్డిపల్లి, నాగులపల్లి, మాచుపల్లి, బావాయిపల్లి వాగులపై వంతెనలను మంజూరు చేయించానన్నారు. నర్సాయపల్లి క్రాస్ రోడ్డు నుంచి చెన్నారం వరకు బీటీ రోడ్డు కోసం నిధులు మంజూరు చేయించగా, నేటికీ ఆ పనులు కొనసాగుతున్నాయన్నారు.
కర్రెన్నబండ తండా వాగుపై వంతెన నిర్మాణం కోసం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేశామని, ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు ఎందుకు పనులు చేయలేకపోతున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కారు తరుగు పేరుతో మోసం చేస్తున్నదని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి మంచి కోసం పనిచేయాలే తప్పా కక్షసాధింపులకు కాదన్నారు.
లేదంటే రెట్టింపు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమస్యలను గాలికొదిలేసి, ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ కాలం వెల్లదీయడం చేతగానితనానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రఘువర్దన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ రుక్మారెడ్డి నాయకులు సురేశ్‌రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.