వనపర్తి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) :వనపర్తి జిల్లా కాంగ్రెస్లో బీఫాంల కుంపటి రాజుకున్నది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని
పనిచేసిన వారిని కాదంటూ.. కొన్ని వార్డుల్లో కొత్త వారికి బీఫాంలు ఇచ్చారని పాత కాంగ్రెస్కు చెందిన పలువురు కంట తడిపెట్టారు. వనపర్తి డీసీసీ కార్యాలయంలో మంగళ వారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి కసరత్తు చేసి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫాంలు అందించారు. అయితే 1, 7, 21, 25వ వార్డుల్లో అభ్యర్థుల ఎంపికపై ఆశావహులు భగ్గుమన్నారు. ముందు నుంచి కాంగ్రెస్ను నమ్ముకుని పని చేస్తే.. చివరకు అన్యాయం చేశారని రాగి లక్ష్మి ఆవేదన చెందారు.
పార్టీ కోసం పుస్తెలు అమ్ముకుని పని చేశామని, అయినా కనికరం రాలేదని కంట తడిపెట్టారు. 21లో ద్యారపోగు వెంకటేశ్ తనకు గతంలో ముగ్గురు పిల్లలు ఉండడంతో అవకాశం రాలేదని, ప్రస్తుతం ఆ నిబంధన లేకపోవడంతో పోటీ చేద్దామని ఆశతో ఉంటే తనకు అవకాశం ఇవ్వలేదని వాపోయాడు. 7, 25వ వార్డుల నుంచి అభ్యర్థులకు కాంగ్రెస్ బీఫామ్స్ సరైన సమయంలో అందలేదు. ఆలస్యంగా ఇవ్వడంతో నక్క సుజాత, కదిరె రాములు మున్సిపల్ కార్యాలయం వరకు రాగానే సమయం మించిపోవడంతో గేటు బయటే నిలబడిపోయారు. సమయం దాటడంతో అధికారులు గేటు మూసి వేయగా.. అవకాశం లేకుండాపోయింది. దీంతో ఆశావహులు నిరుత్సాహానికి గురయ్యారు. 25 వార్డు నుంచి చివరి క్షణం వరకు పార్టీ బీఫాం కోసం తీవ్రంగా పోటీపడ్డా రవికి దక్కకపోవడంతో రాములును గేటు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం గందరగోళాన్ని తలపించింది. ఇంకా పలు వార్డుల్లో కాంగ్రెస్కు రెబల్స్ బెడద ఉన్నది.