వనపర్తి, మార్చి 7: జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి సుబ్బారెడ్డిని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి శుక్రవారం సస్పెండ్ చేశారు.ఆయన బీసీ వెల్ఫేర్ నిధులను పక్కదారి పట్టించారని పలు విద్యార్థి, కుల సంఘాల నేతలు ఆరోపణలు చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌తోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై జిల్లా అదనపు కలెక్టర్ జీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కలెక్టర్ విచారణ నిర్వహించారు. అదనపు కలెక్టర్ జీ వెంకటేశ్వర్లు నివేదిక ఆధారంగా సుబ్బారెడ్డిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.
బీసీ కార్పొరేషన్ ఖాతాలో ఉన్న నిధులను కూడా దుర్వినియోగం చేశారని, కార్యాలయ సిబ్బందితో పనులు చేయించుకున్నాడన్న ఫిర్యాదులు వచ్చాయి. 2022 జూన్‌లో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిగా సుబ్బారెడ్డి వచ్చారు. అంతకు ముందు పని చేస్తున్న జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాష్ బదిలీ కావడంతో ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు.
మూడు నెలల క్రితం జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ వినయ్ ప్రభు, పౌర సరఫరాల సంస్థ డీఎం ఇర్ఫాన్ సైతం అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురయ్యారు. పని విధానం సక్రమంగా లేకపోవడం, మరికొన్ని తప్పుడు వ్యవహారాలు జరిగాయని అప్పట్లో కొన్ని కుల సంఘాలు జిల్లా, రాష్ట్ర అధికారులకు ఫిర్యాదులు చేయడంతో వారిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కలెక్టరేట్లో అవినీతి రాజ్యమేలుతుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా అధికారులు వరుసగా సస్పెన్షన్లకు గురవుతుండటం చర్చానీయాంశమైంది.