వనపర్తి, జూలై 12 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీసీ రిజర్వేషన్ల పేరిట మరోసారి మోసానికి కాంగ్రెస్ తెరతీసిందని, బీసీ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో మాజీ మార్కెట్ చైర్మన్ రమేశ్ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో గట్టుయాదవ్ మాట్లాడారు.
42శాతం రిజర్వేషన్లకు ఎలాంటి చట్టబద్ధత కల్పించకుండానే అంతా అయిపోయిందని ఊరిస్తున్న కాంగ్రెస్ ఎత్తుగడలను బీసీ సమాజం గుర్తించాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్ల పాలనలో అమలు చేస్తున్న హామీలను బేరీజు వేసుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ను బద్నాం చేయాలన్న కుట్రతో కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. కామారెడ్డిలో ఎన్నికల ముందు ఢిల్లీ పెద్దలతో చేయించిన బీసీ డిక్లరేషన్లను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు.
నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే సీఎం స్థానం బీసీకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ మరో జగన్నాటకానికి బీసీ రిజర్వేషన్ల పేరుతో చేస్తున్న కుట్రలో భాగమే తప్పా బీసీలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. బీసీల రిజర్వేషన్ అమలు కాదని కాంగ్రెస్‌కు తెలిసి కూడా మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. రెండేళ్ల పాలనలో చెప్పుకునేందుకు ఏమీ లేవన్నారు. కేవలం స్థానిక ఎన్నికల్లో బీసీలను కాంగ్రెస్‌వైపు తిప్పుకోవడం కోసం రిజర్వేషన్లను తెరపైకి కాంగ్రెస్ తెచ్చిందన్నారు.
గడచిన రెండేళ్లలో ప్రజలకు చేసిన మంచి పనులు లేకపోవడం, ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎన్ని రోజులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. చట్టబద్దత లేని రిజర్వేషన్లను ప్రకటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాటలకు కొందరు బీసీ నాయకులు వెళ్లి అహో.. ఓహో అంటూ సమర్థించడం వెనక కూడా బీసీ సమాజాన్ని అయోమయంలోకి నెట్టేయడమేనన్నారు. దీనిపై బీసీ సమాజం అప్రమత్తంగా ఉండాలని, పార్లమెంట్లో బీసీ బిల్లును అమలు చేయించడం ద్వారానే బీసీలకు రిజర్వేషన్ల అమలు జరుగుతుందన్నారు.
దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏరాష్ట్రంలోనూ బీసీ రిజర్వేషన్లను అమలు చేయలేదన్న వాస్తవాలను గుర్తించాలని, రాష్ట్రంలో వ్యవసాయానికి యూరియా కొరతతో రైతులు అల్లాడుతుంటే ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆధార్‌కార్డుకు ఒక యూరియా బస్తా అంటూ చెప్పడం విడ్డూరమన్నారు. ఎకరా పొలానికి ఒక యూరియా బస్తా ఇవ్వాలని గట్టు యాదవ్ డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నందిమళ్ల అశోక్, విజయ్‌కుమార్, రాములు, వేణు యాదవ్, పృథ్వీనాథ్, కర్రెస్వామి, హుస్సేన్, రాము, సురేశ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.