మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 8 : బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ బహుజన రాజ్యాధికార సమితి అధ్యక్షుడు మైత్రి యాదయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన ఆధ్వర్యయంలో బీసీ నాయకులు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా చేసిన కులగణనలో బీసీలను తగ్గించి చూపడం కుట్రపూరితమని ఆరోపించారు.
అదే విధంగా భారత రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా ప్రస్తుత రాజకీయాలు జరుగుతున్నాయని, సాధించుకున్న తెలంగాణను మళ్లీ సంపన్న వర్గాలే రాజ్యం ఏలుతున్నాయని, బడుగు బలహీన వర్గాలను యాచించేస్థాయికి పరిమితం చేశారన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ సంక్షేమ పథకాలను న్యాయపరంగా రావాల్సిన వాటాను రానీయకుండా విద్య, ఉపాధి రంగాల్లో దామాషా ప్రకారం దక్కకుండా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలను ఇంకా బీదరికంలోని నెట్టేస్తున్నారని, ఇప్పటికైనా మారాలన్నారు. కార్యక్రమంలో బుక్క మోహన్‌బాబు, కది రి అంజ య్య, మడివాల నగేశ్‌కుమార్, బాలరాజ్ , కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కులగణనపేరుతో బీసీలను తక్కువగా చూపించేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 21లక్షల మంది బీసీలు కాంగ్రెస్ సర్కార్‌లో లెక్కల్లో లేకుండా పోయారు. ఇందుకు రేవంత్సర్కార్ సమాధానం చెప్పాలి. కులగణనలో ఓసీలు 10శాతం మాత్రమే ఉంటే 15శాతం చేసి చూపించారు. కాంగ్రెస్ సర్కార్ బీసీలను చంపే ప్రయత్నం చేస్తుంది. బీసీలను మోసం చేసేందుకే కులగణన కాంగ్రెస్ చేపట్టింది. రిజర్వేషన్ల ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడకగా ఉంది.
బీసీలను అణచివేసే ప్రయత్నంగానే కులగణన చేపట్టారు. రాజకీయంగా ఎదగకుండా చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న నాటకం ఇది. బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్రకుటుంబ సర్వే చేసినప్పుడు 51శాతం ఉన్న బీసీ జనాభా ప్రస్తుతం 46శాతానికి పడిపోయిందంటే కుల గణన ఎలా చేశారనేది అర్థమవుతుంది. బీసీలకు కామారెడ్డి సభలో డిక్లరేషన్ ఇచ్చిన విధంగా 42శాతం అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కి ఇప్పుడు మోసం చేసి బీసీలను అణగదొక్కే ప్రయత్నం కాంగ్రెస్ సర్కారు చేస్తున్నది. బీసీలను తక్కువ చేసి చూపిస్తున్న రేవంత్‌రెడ్డికి రాబోయే రోజుల్లో బీసీలే తగిన బుద్ధి చెబుతారు.
– కురువ పల్లయ్య, బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కోఆర్డినేటర్
ఆత్మకూరు, ఫిబ్రవరి 8: కులగణనతో మరోసారి కాంగ్రెస్ కుట్రలు బయటపడ్డాయి. అగ్రవర్ణాలకు తలొగ్గిన కాంగ్రెస్ సమాజంలో 60శాతం బడుగులుంటే ఓసీల సంఖ్యను పెంచింది. బీఆర్ఎస్ హయాంలో 52శాతం ఉన్న బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం 46 శాతంగా చూపెట్టడం విడ్డూరంగా ఉంది. బీసీలను తక్కువగా చూపెట్టి ఓసీలను ఎక్కువగా చూపెట్టడం పెద్దకుట్ర. చాపకింద నీరులా కుట్రలు పన్నుతూనే పైనుంచి 42శాతం సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పడం కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు తార్కాణం.
బీసీ జనాభా ఏ కారణంగా తగ్గిందో ప్రజలకు చెప్పాలి. బీసీలతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం సరిగ్గా పాలన చేయలేదు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి పునఃసమీక్ష చేపట్టాలి. నిపుణుల ఆధ్వర్యంలో మరోసారి సమగ్ర సర్వే నిర్వహించాలి. బీసీలకు అన్యాయం జరిగితే న్యాయ పోరాటం చేస్తాం. బీసీల హక్కులను కాపాడే దిశగా అన్ని రాజకీయ, సామాజిక పక్షాలు ఉద్యమించాలి. సమగ్ర లెక్కలు బయటకి తీసి ఎవరెవ్వరు ఎంత శాతమున్నారో తేల్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి.
-కె.కోటేశ్వర్, మాజీ వైస్‌ఎంపీపీ ఆత్మకూరు
కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణన బీసీలనే కాదు అన్ని కులాలను తక్కువ చేసి కేవలం అగ్రవర్ణాలకే అధిక ప్రాధాన్యత కల్పించింది. సర్వే మొత్తం పూర్తి తప్పుల తడకగా చేసినట్లు జనాభా నిష్పత్తిని చూస్తే తెలుస్తోంది. రేవంత్ సర్కారు కావాలనే బీసీ జ నాభాను తగ్గించి చూపే ప్రయత్నం చేసినట్లు అర్థమైతుంది. గతంలోకంటే ఇప్పుడు బీసీ ల జనాభా ఎలా తగ్గుతారో ప్రభుత్వం స్పష్టంచేయాలి. కేసీఆర్ సర్కారు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల లెక్క పక్కాగా తేలింది. అలాంటిది ఇప్పుడు ఎందుకు తగ్గిందో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కులగణనను ఒప్పుకోం. బీసీ ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం విచారకరం.
వెంటనే ప్రభుత్వం మరోమారు పారదర్శకంగా బీసీల కులగణన చేపట్టి దానికి చట్టబద్ధత కల్పించాలి. 2011 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో బీసీల జనాభా పెరిగిందే కాని తగ్గలేదు. గతంలో 7 శాతం ఉన్న ఓసీలు ఇప్పుడు 16శాతానికి ఎలా పెరిగారో ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. ఇది కేవలం ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకోవడానికి చేసిన ఎత్తుగడలో భాగంగా కనిపిస్తుంది. జనాభా పెరిగితే బీసీ రిజర్వేషన్లు పెంచాల్సి వస్తద ని ప్రభుత్వమే తగ్గించి చూపుతున్నది. నిజంగా బీసీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే గ్రామాల వారీగా కులగణన రిపోర్టుల ను ప్రకటించాలి. బీసీల రిజర్వేషన్ 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి.
– తెలుగు సురేందర్, బీసీ పొలిటికల్ జేఏసీ మండలాధ్యక్షుడు, ఆత్మకూరు