మహబూబ్‌నగర్ కలెక్టరేట్, నవంబర్ 22 : రాష్ట్రంలో బీసీల హక్కుల పరిరక్షణ కోసమే బీసీ కమిషన్ బహిరంగ విచారణలు నిర్వహిస్తోందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన స్థితిగతులు, వెనుకబాటుతనం, వారికి కల్పించాల్సిన అవకాశాలు తదితర అంశాలపై అధ్యయనం నిమిత్తం శుక్రవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. వివిధ కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థల నుంచి విజ్ఞాపనలను కమిషన్ స్వీకరించింది.
బీసీల స్థితిగతులపై వారికి కల్పించాల్సిన అవకాశాలపై బహిరంగ విచారణ నిర్వహించిన అనం తరం బీసీ కమిషన్ చైర్మన్ మీడియాతో మాట్లాడారు. బీసీలకు జనాభా పరంగా రిజర్వేషన్లు కల్పించాలని, క్రిమిలేయర్ తొలగించాలని బీసీ సంఘాలు విజ్ఞప్తి చేశాయని, అన్ని వినతులను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. బీసీ హక్కుల పరిక్షణ కోసం కమిషన్ పనిచేస్తుందన్నారు. బీసీలో ప్రస్తుతం చైతన్యం పెరిగిందని సమాజంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారికి మంచి అవకాశాలు కల్పించేందుకు మార్గం ఏర్పడుతుం దన్నారు. ఇప్పటి వరకు 8 విచారణలు పూర్తి చేయగా ఇది 9వ విచారణ అని తెలిపారు. ఈ నెల 26 వరకు బహిరంగ విచారణలు ఆయా జిల్లాల్లో కొనసాగుతాయని కమిషన్ చైర్మన్ వివరించారు.
సమాజంలో వెనుకబడిన వర్గాల వారికి జనాభాపరంగా రిజర్వేషన్లు కల్పించాలి. క్రిమిలేయర్ తొలగించాలి.. పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాల ప్రతినిధులు కోరారు. జాండ్ర కులం వారు చేనేత వృత్తి చేస్తారని, మేదర సంఘం పేరుతో గుర్తించాలని, బీసీ-ఈ గ్రూప్‌లో సయ్యద్, పఠాన్ వారిని కలపాలని, బీసీ-బీలో ఉన్న దూదేకుల వారిని మైనార్టీ గ్రూప్‌లో చేర్చాలని కోరారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌లలో 15 శాతం కేటాయించాలని, బీసీలపై అత్యాచారాలు, అన్యాయాలకు బీసీ అత్యాచారాలకు నిరోధక పరిరక్షణ చట్టం తేవాలన్నారు.
మైనార్టీ ఫకీర్ సాబ్‌లను ఎంబీసీలో చేర్చాలని, బీసీ కులాలు గ్రూప్ మార్పు చేయాలని, మేదరులు, ఉప్పరులు, వడ్డెరులను బీసీ నుంచి ఎస్టీలోకి చేర్చాలని ముదిరాజుల నుంచి బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని కోరారు. కాగా కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, సభ్యులు బీసీ కమిషన్ సభ్యులు జయప్రకాశ్, టి.సురేందర్ రంగు బాలలక్ష్మికి కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ జానకి, జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్, నాగర్‌కర్నూల్ కలెక్టర బదావత్ సంతోష్, వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు, లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమశాఖ అధికారులు ఇందిర, ఖాజా నజీమ్అలీ, సుబ్బారెడ్డి, రమేశ్‌బాబు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.