మక్తల్‌టౌన్, అక్టోబర్ 20: పట్టణంలో బతుకమ్మ సంబురాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో మహిళలు తీరొక్క పూల తో బతుకమ్మలను చేసి భక్తితో గౌరమ్మలను పూజించారు. అనంతరం చిన్నా పెద్దాతేడా లేకుండా బతుకమ్మ పాటల తో కోలాటాలు వేస్తూ ఆడిపాడి అలరించారు. పట్టణం లోని వినాయక్ నగర్లో భవసార క్షత్రీయ మహిళాసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళలు దాండియాతో అలరించారు. కార్యక్రమంలో భవసార క్షత్రీయ సంఘం మహిళా కమిటీ సభ్యులు నీంకర్ మాధురి, గాయత్రి, సంధ్య, అనిత , ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్, అక్టోబర్ 20 : మండలకేంద్రంలోని గాంధీనగర్, కార్గిల్ చౌరస్తా, లాల్బహద్దూర్నగర్లో శుక్రవారం మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చిన్నా పెద్ద తేడాలేకుండా మహిళలు, విద్యార్థులు తీరొక్కపూలతో బతుకమ్మలను చేసి పూజించి. ఆట పాటలతో అలరించారు. అనంతరం మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా స్థానిక పెద్ద చెరువువద్దకు చేరుకొని బతుకమ్మలను నీళ్లల్లో వదిలారు. వేడుకల్లో సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తోందన్నారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కోరం పద్మ, వార్డు సభ్యులు నర్సింహారాజ్గౌడ్, హేమలత తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ, అక్టోబర్ 20 : మండలంలోని మూడుమాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగనవాడీ టీచర్లు తీరొక్క పూలతో బతుకమ్మను అమర్చి పసుపు, కుంకుమలతో గౌరమ్మను చేసి పూజించారు. అనతరం కోలాటాలు వేస్తు బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. అనంతరం సమీప చెరువులో బతుకమ్మలను వదిలారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సునీత, కవిత, వెంకటేశ్వరి, దౌలత్‌బీ, చిన్నారులు, యువతులు తదితరులు పాల్గొన్నారు.