మహబూబ్‌నగర్ విద్యావిభాగం, సెప్టెంబర్ 28 : ‘చిత్తూ చిత్తూల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మా.. ఈ వాడలోనా’..! ‘ఏమేమి పువ్వుప్పునే గౌరమ్మా.. ఏమేమి కాయోప్పునే గౌరమ్మా..! తంగేడు పువ్వొప్పునే గౌరమ్మా.. తంగేడి కాయోప్పుడే గౌరమ్మా’.. అంటూ బతుకమ్మ పాటలు మార్మోగాయి. శనివారం మహబూబ్‌నగర్‌లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. విద్యార్థినులు, అధ్యాపకులు సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆటపాటలతో హోరెత్తించారు. విద్యార్థినులు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు బతుకమ్మలను ఎత్తుకుని డ్యాన్స్‌లు, కోలాటం ఆడారు.
తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సందడితో కళాశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భంగా పలువురు పండుగ విశిష్టతను వివరించారు. ప్రకృతిని ప్రేమించి పూజించడమే బతుకమ్మ అన్నారు. ప్రపంచంలో అనేక జాతులు ఉన్నా.. ప్రకృతిని ఆరా ధించే ఏకైక జాతి తెలంగాణ వాసులే అన్నారు. ఈ పండుగ తెలంగాణ పేరును విశ్వవ్యాప్తం చేయగా.. మధ్యలో కొంత నిరాధరణకు గురైనా తిరిగి బతుకమ్మను ఇంటింటికీ చేర్చిన ఘనత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితదే అన్నారు. ఈ పండుగను తొమ్మిది రోజులు పాలమూరులో విద్యార్థినులు వైభవంగా నిర్వహించనున్నారు.