మహబూబ్‌నగర్ మెట్టగడ్డ, జనవరి 3 : బ్యాంకర్లు రైతు సంక్షేమమే ధ్యేయంగా 2023 -24 ఏడాదికి సంబంధించి వివిధ పంటలకు నిర్ణయించిన మేరకు పంట రుణాలు ఇవ్వాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సమావేశ మందిరంలో డీసీసీబీ ఆధ్వర్యంలో వివిధ పంటరుణాల పరిమితిపై మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి స్కిల్ ఆఫ్ పైనాన్స్ను తప్పకుండా బ్యాంకర్లు అమలు చేయాలని, ముఖ్యంగా రైతు ప్రాధాన్యతగా రుణాలు ఉండాలని కోరారు. ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ మిల్లెట్స్‌గా గుర్తించినందున మిల్లెట్స్ పండిస్తున్న ప్రతి రైతుకూ బ్యాంకులు రుణం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా జిల్లాలో ఆయిల్‌పాం తోపాటు, ఉద్యాన పంటలను విరివిగా పండించేందుకు అవకాశం ఉన్నందున జిల్లాను ఉద్యమరూపంలో హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నారు.
ఆర్ శెట్టి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని మండలాలలో మండల మహిళా సమాఖ్య భవనాలు ఉన్నందున ఆయా ప్రాంతాల్లోని అవసరాలను బట్టి 5 నుంచి 7 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాదిరిగానే ఇతర బ్యాంకులు కూడా ముందుకొచ్చి శిక్షణ ఇచ్చి మహిళలు పెద్దఎత్తున ఉపాధి పొందేలా చూడాల్సిన అవసరం ఉందని సూచించారు. అనంతరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ నిజాం పాషా మాట్లాడుతూ జిల్లాలో అన్ని బ్యాంకులు పంట రుణాలు ఇస్తున్నాయని ఈ ఏడాది కూడా విరివిగా పంట రుణాలు ఇచ్చి రైతులకు మేలు చేయాలని కోరారు. ఈ సందర్బంగా కలెక్టర్ నాబార్డ్ ఆధ్వర్యంలో 2023-24 సంవత్సానికి సంబంధించి రూపొందించిన మహబూబ్‌నగర్ జిల్లా వనరుల ఆధారిత రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. సమావేశంలో ఎల్డీఎం భాస్కర్, డీసీసీబీ సీఈవో లక్ష్మయ్య, ఎస్బీఐ ఏజీఎం శ్రవణ్‌కుమార్‌రెడ్డి, నాబార్డ్ డీడీఎం ఎంవీవీఎస్ శ్రీనివాస్, షణ్ముఖచారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్, ఉద్యానశాఖ అధికారి సాయిబాబా, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, పశు సంవర్ధక అధికారి మధుసూదన్ గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్లు హాజరయ్యారు.