అయిజ, మార్చి 3 : యాసంగి రైతులకు గడ్డుకాలం దాపురించింది. పంటలను ఎలా కాపాడుకోవాలో అని మదనపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిమట్టాలు కనిష్ఠ స్థాయికి చేరాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటిమట్టం అడుగంటుతోంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టులో పంటలు సాగు చేసిన రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. నీళ్లు అందక పంటలు ఎక్కడ ఎండుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని సింధనూర్ హెడ్‌రెగ్యులేటరీకి నీరు నిలిచిపోవడంతో ఆర్డీఎస్ ప్రధాన కాల్వ ఒట్టిపోయింది. ఆనకట్ట అడుగంటుతుండంతో అయిజ మండలంలోని ఆయకట్టులో సాగైన వరి, మొక్కజొన్న, వేరుశనగ, మిరప, ఇతర పంటలు చేతికందుతాయే..? లేదోనని రైతులు దిగాలు చెందుతున్నారు. నాలుగు రోజులుగా ప్రధాన కాల్వకు నీరు చేరక పొలాలకు అందడంలేదని వాపోతున్నారు. ప్రస్తుతం ఆర్డీఎస్లో 5.6 అడుగుల నీటిమట్టం ఉండగా, కాల్వకు 216 క్యూసెక్కులు చేరుతున్నప్పటికీ కర్ణాటకలోని నాన్ ఆయకట్టు రైతులు మోటర్లతో వీటిని తోడేస్తున్నారు. దీంతో దిగువకు నీరు చేరడంలేదని రైతులు పేర్కొంటున్నారు.
టీబీ డ్యాంలో 31.216 టీఎంసీలు
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 31.216 టీఎంసీలు నిల్వ ఉండగా, అవుట్‌ఫ్లో 7,178 క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31.216 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 1633 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికిగానూ ప్రస్తుతం 1606.52 అడుగులుగా నమోదైంది.
5న ఆర్డీఎస్, కేసీ కెనాల్ జాయింట్ ఇండెంట్‌కు చర్యలు
టీబీ డ్యాం నుంచి ఈనెల 5 నుంచి ఆర్డీఎస్తోపాటు కేసీ కెనాల్ ఇండెంట్‌ను జాయింట్‌గా విడుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్డీఎస్ టీఎంసీ, కేసీ కెనాల్‌కు 1.6 టీఎంసీలు 13వ తేదీ వరకు రోజుకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేసేందుకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఇరిగేషన్ ఈఎన్సీలు టీబీ బోర్డుకు లేఖలు రాశారు. విడుదలైన నీరు తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు 8 లేదా 9న ఆనకట్టకు చేరే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆనకట్టకు సకాలంలో నీరు చేరితేనే పంటలు ఎండవని, ఆ దిశగా అధికారులు చొరవ తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరు తున్నారు.
జాయింట్ ఇండెంట్ విడుదలకు చర్యలు
ఈనెల 5న తెలంగాణ, ఏపీ రాష్ర్టాల రైతులు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టీబీ డ్యాం నుంచి జాయింట్‌గా నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇరు రాష్ర్టాల ఇండెంట్లో భాగంగా ఆర్డీఎస్ ఒక టీఎంసీ, కేసీ కెనాల్‌కు 1.6 టీఎంసీలను రోజుకు 4 వేల క్కూసెక్కుల చొప్పున 9 రోజులపాటు విడుదల చేస్తారు. ఈ నీరు వస్తే పంటలు చేతికొచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు అధికారులకు పూర్తిగా సహకరించాలి.
– విజయ్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఎస్ ఈఈ