Alampur | అలంపూర్, జూన్ 24 : అలంపూర్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అలంపూర్ సీఐ రవిబాబు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సీఐ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా అలంపూర్ సీఐ రవిబాబు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు అని, ఇవి యువతను చెడు మార్గంలో నడిపిస్తాయని, చదువులో వెనుకబడేలా చేస్తాయన్నారు. భవిష్యత్తును నాశనం చేస్తాయని వివరించారు. కాబట్టి, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులౌతున్నారు.
ఒకసారి దీనికి బానిసలైతే ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలని తగు సూచనలు తెలిపి, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అందరూ పాటుపడాలని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అలాగే వీటితోపాటు రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని, విద్యార్థులు అందరూ పోక్సో చట్టం పైన అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్స్, ట్రైనీ ఎస్సై నిమ్మల కుమార్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.