వనపర్తి, జనవరి 8 : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఆటో కార్మికుల జీవితాలు ఆగమవుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పట్టణ కార్మిక విభాగం ఆటో యూనియన్ నూతన కమిటీని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం, కానీ ఆటోలతో జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా కనుమరుగు చేయడానికి పూనుకుంటున్నదని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ ఆటో యూనియన్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆటో కార్మికులకు అండగా నిలిచిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డికి కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్స్ బండారు కృష్ణ, కంచెరవి, మహేశ్, మీడియా కన్వీనర్ అశోక్, ఆటో యూనియన్ కార్మిక సంఘం అధ్యక్ష,కార్యదర్శులు గంధం రాజు, గుర్రం శ్రీను, యాదయ్య, రాములు, సత్యంయాదవ్, గోపి, అనిల్, మన్యం, సమద్, రాజ్‌కుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు.