రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరు తో ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం తమ ఆదాయానికి గండికొట్టిందని ఆటోవాలాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టగా.. జడ్చర్ల, దేవరకద్రలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మా జీవితాలను ఆగం చేసిందంటూ పలువురు ఆగ్రహం వెలిబుచ్చారు. తమకు ఉపాధి కల్పించి ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని కోరారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు.
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 18 : ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మేం రోడ్డున పడ్డామని.. ఆటోలు నడుపుకొని మా కుటుంబాలను పోషించుకునేవారని, నేడు రూపాయి ఆదాయం లేక కిస్తులు కట్టలేక, కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని ఆటోవాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మాకు ఉపాధి కరువైందని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆటోడ్రైవర్లు ఆందోళన చేపట్టారు. పట్టణంలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రవాణారంగంపై 50లక్షల మంది కార్మికులు జీవిస్తున్నారన్నారు. వీరి సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహాలక్ష్మి పథకం ప్రారంభించడం వల్ల కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫైనాన్స్‌లో వివిధ రకాల వాహనాలు తీసుకొచ్చి వాటిని నడపలేక ఫైనాన్స్ కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా 2019 మోటార్ వాహనాల చట్టాన్ని రద్దు చేయాలన్నారు. ఏడాదికి రూ.12వేలు చెల్లిస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చి ఆ పథకాన్ని అమలు చేయకుండా కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యూనియన్లతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వరర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి, ప్రధాన కార్యదర్శి పొదిల రామయ్య, ఉపాధ్యక్షుడు శివకుమార్, ఆటో యూనియన్ నాయకులు మల్లేశ్, మైబు, సైదులు, మహేశ్, శివ, సుబ్బయ్య, సిరాజ్, శ్రీను, సుల్తాన్, ఖయ్యూం, వేణుగోపాల్, కృష్ణ, రాఘవేంద్ర, పరమేశ్, వెంకటేశ్, బాలస్వామి, కృష్ణయ్య, కురుమయ్య, రాజు, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.