మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 22 : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను అమలుచేయాలని లేదంటే ఈ నెల 24న సమ్మె తప్పదని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ చౌరస్తాలో నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ఆటోలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల జేఏసీ నాయకులు శ్రీనివాస్, బాబుమియా, నాగేశ్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల కోసం మహలక్ష్మి పథకం అమలు చేయడంతో గిరాకీలు లేక ఆటో డ్రైవర్ల పరిస్థితి దినదినగండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు కుటుంబాలు పోషించక లేక ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహరంగా రూ.25 లక్షలు ఇవ్వాలని, అదే విధంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఆటో డ్రైవర్ల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ఆటో ఇన్సూరెన్స్‌ను కూడా రూ.వెయ్యికి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఆటో డ్రైవర్లకు ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ, ఏఐటీయూసీ నాయకులు రాములు, కురుమూర్తి, వెంకటేశ్, సురేశ్ మద్దతు తెలిపి మాట్లాడుతూ మహలక్ష్మి పథకం పేరిట లక్షలాది మంది ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయినప్పటికీ ప్రభుత్వం మరోమారు ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను కొనుగోలు చేసి నడిపిస్తామనడం దారుణం అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేయడంతోపాటు 24న నిర్వహించే సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు నరేశ్, రాజ్‌కుమార్, సయ్యద్యాసిన్తోపాటు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.