Bangladesh : బంగ్లాదేశ్ (Bangladesh) లో మైనారిటీలపై దాడులు ఆందోళనకరంగా మారుతున్న వేళ వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హిందువులు (Two Hindus) దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. తాజా ఘటనలతో హిందూ మైనారిటీల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నౌగావ్ జిల్లా (Naugao distirct) మహాదేవ్‌పూర్ (Mahadevpur) లో 45 ఏళ్ల హిందూ స్వర్ణకారుడు అలీఫ్ చంద్ర దత్తా (Alif Chandra Datta) హత్యకు గురయ్యాడు.
అలీఫ్ చంద్ర దత్తా సోమవారం రాత్రి 8.30 గంటలకు మహాదేవ్‌పూర్ బజార్‌లోని తన నగల దుకాణం నుంచి ఇంటికి బయలుదేరాడు. రాత్రి 9 గంటల సమయంలో దులాల్‌పారా ప్రాంతంలోకి రాగానే కొందరు దుండగులు అతడిని అడ్డుకున్నారు. పదునైన ఆయుధంతో దాడి చేశారు. అనంతరం అతడి వద్ద ఉన్న బంగారం, 7 లక్షల బంగ్లాదేశీ టాకాలను దోచుకుని పారిపోయారు. తీవ్రంగా గాయపడిన దత్తాను కుటుంబసభ్యులు, స్థానికులు రాజ్‌షాహీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ దత్తా మృతిచెందారు. ఇది కేవలం దోపిడీ ఘటననా..? మరేదైనా కక్ష ఉందా..? అన్నది ఇంకా తేలలేదని మహాదేవ్‌పూర్ పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇక కాక్స్‌బజార్ జిల్లా మహేశ్‌ఖాలీ ఉపజిల్లాలో 45 ఏళ్ల హిందూ మహిళ రాణి సుశీల్ హత్యకు గురైంది. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో హోనాక్ యూనియన్‌లోని తన ఇంట్లో ఆమె వంట చేస్తోంది. దొంగతనం కోసం ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అతడిని గమనించిన రాణి కేకలు వేయడంతో ఆమె ముఖాన్ని పట్టుకుని పలుమార్లు కత్తితో పొడిచి పరారయ్యాడు.
తీవ్రంగా గాయపడిన ఆమెను చకారియా ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి తర్వాత మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలకు కొన్ని రోజుల ముందే రంగ్‌పూర్‌లో రిటైర్డ్ హిందూ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి, ఆయన కుటుంబంలోని మరో ముగ్గురు హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్‌లో హిందువులతోపాటు ఇతర మైనారిటీలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో.. తాజాగా జరిగిన హత్యలు మరింత కలకలం రేపుతున్నాయి.