Masood Azhar : మసూద్ అజార్.. కరుడుగట్టిన ఉగ్రవాది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్తాపకుడు. ఇండియాలో జరిగిన అనేక కీలక ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి. ప్రస్తుతం మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడు అనే అంశంపై స్పష్టత లేదు. అతడు పాకిస్తాన్‌లోనే తలదాచుకున్నాడు అని ఇండియా సహా అనేక దేశాలు ఆరోపిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం తమ దేశంలో లేడని, ఆఫ్గనిస్తాన్‌లో ఉన్నాడని చెబుతోంది. మసూద్ అజార్ ఆఫ్గనిస్తాన్ వెళ్లిపోయాడని పాకిస్తాన్ కొన్నేళ్లుగా ఆరోపిస్తోంది.
అయితే, ఈ ఆరోపణలపై ఆఫ్గన్ స్పందించింది. అతడు తమ దేశంలోనే లేడని వెల్లడించింది. ఈ అంశంపై ఆఫ్గన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. మసూద్ తమ దేశంలో లేడని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇతర దేశాల మీద దాడికి, వ్యతిరేక కుట్రలకు తమ భూభాగాన్ని వినియోగించబోమని వెల్లడించింది. ఇండియాలో 2001లో పార్లమెంట్‌పై జరిగిన దాడికి, 2008 ముంబై దాడులకు, 2016లో పఠాన్‌కోఠ్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడికి, 2019లో జరిగిన పుల్వామా దాడికి పాల్పడింది జైషే మహ్మద్ సంస్థే. ఈ సంస్థను నడిపించి, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, మన దేశం మీదకు ఉసిగొల్పింది మసూద్ అజారే.
అందువల్లే అతడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2019లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అలాంటి మసూద్ అజార్‌కు ఆశ్రయమిచ్చినందుకు పాకిస్తాన్‌ను ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఏ) నిషేధిత జాబితాలో చేర్చింది. అంటే, యూరప్ సహా అనేక దేశాలు అందించే ఆర్థిక సహాయాన్ని తీవ్రవాదులకు వినియోగిస్తే.. ఎఫ్ఏటీఏ ఆయా దేశాలను నిషేధిత జాబితాలో చేరుస్తుంది. అలా, పాకిస్తాన్‌ను ఈ జాబితాలో చేర్చారు. ఇలా చేయకూడదనుకుంటే మసూద్ అజార్‌ను అరెస్ట్ చేయాలి. కానీ, 2019 నుంచి అతడు తమ దేశం వదిలి ఆఫ్గన్ వెళ్లిపోయాడని పాక్ చెబుతోంది. 2022లో తాలిబన్లు ఆఫ్గన్‌లో అధికారం చేపట్టిన తర్వాత కూడా మసూద్ అజార్ తమ దేశంలో లేడని వెల్లడించారు. రెండు దేశాలు అతడు తమ దేశంలో లేడని చెబుతుంటూ.. అతడు ఎక్కడ ఉన్నాడు అనే విషయంలో స్పష్టత లేదు.