ఆత్మకూర్ : ఎన్నో ఏళ్లుగా తాలూకా కేంద్రంగా విరాజిల్లుతున్న ఆత్మకూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కాంగ్రెస్ నాయకులు రహమతుల్లా, పరమేష్ విజ్ఞప్తి చేశారు. గురువారం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆదేశం మేరకు.. మండలాన్ని రెవిన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే తీర్మానంపై ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దినదినం వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతున్న ఆత్మకూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్నారు.
మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రజలు నిరాహార దీక్షలు చేశారని నాయకులు వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార నిమిత్తం మక్తల్‌కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆత్మకూరును రెవిన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికే రెండు పర్యాయాలు రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్లుగా కొన్నింటిని ఏర్పాటు చేసినా ఆత్మకూరును పట్టించుకోలేదని అన్నారు.
ఇప్పుడు ప్రజలతో సంతకాల సేకరణ చేపట్టి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట నర్సు, మణివర్ధన్ రెడ్డి, దామోదర్, మేస్త్రి వెంకటన్న, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరాజ్ తదితరులు పాల్గొన్నారు.