ఉమ్మడి పాలనలో వ్యవసాయ సీజన్ వచ్చిందంటే చాలు రైతుల కష్టాలు వర్ణణాతీతం. లాఠీదెబ్బలు, పోలీస్ స్టేషన్ల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు, చెప్పుల క్యూలైన్లు.. ఇలా రోజుల తరబడి ఎదురుచూస్తే తీరా ఒకటో, రెండో ఎరువుల బస్తాలు దొరికేవి. చాలీచాలని ఎరువులతో పంట దిగుబడి రాక తల పట్టుకునేవారు. ఇప్పుడు సింగిల్‌విండోలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, బహిరంగ మార్కెట్లోనూ ఎరువులు పుష్కలంగా లభిస్తున్నాయి. ఆరు నెలల ముందుగానే ప్రభుత్వం వ్యవసాయశాఖ నుంచి నివేదిక తీసుకొని అందుబాటులో ఉంచుతున్నది. రైతుల ఆధార్ నెంబర్లను సేకరించి పీవోఎస్ యంత్రాలతో వేలిముద్రలను తీసుకొని ఎరువులను పంపిణీ చేస్తున్నది. ప్రతి బుధవారం వ్యవసాయ శాఖ నాణ్యతా నియంత్రణ దినోత్సవం పేరిట ఎరువుల విక్రయాలపై తనిఖీలు చేపడుతున్నది. రైతులు కచ్చితంగా బిల్లులు తీసుకోవాలని సూచిస్తుండడంతో బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూలైలో అవసరానికి మించి ఎరువులు నిల్వ ఉండడం విశేషం. ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్జాగా ఎరువులు దొరుకుతున్నాయి.దీంతో కర్షకులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నాగర్‌కర్నూల్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో పెట్టుబడులు మొదలు పంట అమ్మే వరకు ఎన్నో కష్టాలు. నాటి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు వలస పోయి కూలీలుగా మారారు. నేడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, పంట కొనుగోలు కేంద్రాలతోపాటు సకాలంలో విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతోంది. ఫలితంగా కరువు ప్రాంతమైన కందనూలులోనూ వ్యవసాయం గణనీయంగా వృద్ధి చెందుతోంది. ప్రతి ఏటా వానకాలం, యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడు పెరుగుతోంది. ఈ వానకాలం నాగర్‌కర్నూల్ జిల్లాలో 5,43,075 ఎకరాల్లో సాగు చేయొచ్చని వ్యవసాయశాఖ అంచనాలు రూపొందించింది. జిల్లాలో అత్యధికంగా పత్తి 3,63,635 ఎకరాల్లో.. అత్యల్పంగా మినుములు 58ఎకరాల్లో సాగు కానుంది.
వరి 1,29,170 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. గతంలో జిల్లాకు కేవలం 2నుంచి రెండున్నరవేల మెట్రిక్ టన్నుల ఎరువులే వచ్చేవి. దీంతో రైతులు రోజుల తరబడి ఎరువుల కోసం ఎదురు చూసేవారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతి సీజన్లో ఎరువుల కోసం రాస్తారోకోలు, కార్యాలయాల ముట్టడి సర్వసాధారణంగా జరిగేది. వచ్చిన ఎరువులను లూఠీ చేసిన సంఘటనలూ ఉన్నాయి. ఎరువులు తక్కువగా వస్తుండటంతో పోలీస్స్టేషన్లలో క్యూ కట్టించి రైతులకు ఎరువులను అందించారు. భార్యాభర్తలు, పిల్లలు ఎరువుల కోసం మార్కెట్ యార్డులు, సింగిల్‌విండోల వద్ద చెప్పులు, రాళ్లు, తువ్వాళ్లు, బ్యాగులను వరుసలో పెట్టి తమవంతు వచ్చే వరకు ఎదురు చూసిన పరిస్థితులకు తెలంగాణ రాకతో చెక్ పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు అవసరమైన ఎరువులు ఆరు నెలల ముందుగానే వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచుతోంది. సింగిల్‌విండోల ద్వారానే కాకుండా ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, బహిరంగ మార్కెట్లోనూ ఎరువులను అందుబాటులో ఉంచుతోంది.
ఆధార్‌కార్డు నంబర్ ద్వారా పీవోఎస్ యంత్రాల సహాయంతో వేలిముద్ర తీసుకొని ఎరువులను అందజేస్తున్నారు. ప్రతి బు ధవారం వ్యవసాయశాఖ నాణ్యత ని యంత్రణ దినోత్సవం పేరిట ఎరువుల విక్రయాలపై తనిఖీలు చేస్తూ.. ప్రతి రైతు కచ్చితంగా బిల్లులు తీసుకోవాలని సూచిస్తోంది. ఫలితంగా ఎరువుల పంపిణీలో బ్లాక్ మార్కెట్‌కు చెక్ పడింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో గతేడాది వర్షా లు ఆలస్యంగా కురవగా 54,420మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందించారు. ఈసారి 1,28,521మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారుల అంచనా. జూలైలో 19,286మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని భావించగా, జిల్లాలోని 23 సింగిల్ విండో కేంద్రాలు, 45 ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, మిగిలిన 312 ప్రైవేట్ దుకాణాల్లో యూరియా, డీఏపీ, ఎంవోపీ, ఎస్ఎస్పీ, కాంప్లెక్స్ వంటి ఎరువులు 20,877మెట్రిక్ టన్నులు నిల్వ ఉండటం విశేషం. తెలంగాణ వచ్చాక రైతులకు ఎరువుల సమస్య తీరింది.
చెప్పులు లైన్లో పెట్టినం..
వానకాలంలో ఎరువులు, విత్తనాల కోసం రాత్రి పూట తిండీతిప్పలు మాని చెప్పుల ను లైన్లో పెట్టి అరకొర ఎరువులు తీసుకునేటోళ్లం. విత్తనాల కోసం ధర్నాలు, రా స్తారోకోలు చేశాం. రైతుల గురించి నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడంతో రైతుల కష్టాలు తీరాయి. తెలంగాణ రా ష్ట్రంలో ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కిన సందర్భాలు అస్సలు లేవు. ఇది రైతు
ప్రభుత్వం.
జిల్లాలో ఎరువుల సమస్య లేదు
జిల్లాలో ఎరువుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేవు. జిల్లాలో సాగు చేసిన పంటలకు అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. 5.43లక్షల ఎకరాలు సాగవుతాయన్న అంచనా మేరకు 1.28లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు అంచనాలు రూపొందించాం. జూలైలో 19వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని భావిస్తుండగా.. 20వేల మెట్రిక్ టన్నులు సింగిల్ విండోలు, ఆగ్రో కేంద్రాలు ఇతర దుకాణాలతో కలిపి 380 చోట్ల ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతి రైతుకూ ఎరువు అత్యవసరం కాబట్టి.. గతంలో కేవలం పీఏసీసీఎస్లలో మాత్రమే విక్రయిస్తుండగా ఇప్పుడు అన్ని చోట్లా ఎరువులు లభిస్తున్నాయి. ప్రతి బుధవారం ఎరువుల అమ్మకాలపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. – వెంకటేశ్వర్లు, డీఏవో, నాగర్‌కర్నూల్
ఎరువులు, విత్తనాలకు కొరత లేదు
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎరువులు, విత్తనాల విషయంలో ఎటువంటి కొరత లేదు. సీజన్‌కు ముందే ప్రభుత్వం ఎరువులను సిద్ధంగా ఉంచుతున్నది. గతంలో ఎరువులు, విత్తనాల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేసేవాళ్లం. వాటి కోసం దుకాణాలు, వ్యవసాయ కార్యాలయాల ఎదుట పడిగాపులు కాసేటోళ్లం. వరుసలో నిలబడలేని వాళ్లు వారి పాస్‌బుక్, చెప్పులను లైన్లో పెటి వంతు కోసం ఎదురు చూసేటోళ్లు. ఒక్కోసారి మా వంతు వచ్చే సరికి ఎరువులు అయిపోయేవి. మరుసటి రోజు వచ్చి మళ్లీ వరుసలో నిలబడేవాళ్లం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రైతు ఎప్పుడైనా వచ్చి ఎరువులు తీసుకెళ్లేలా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వల్లనే జరిగింది.
– గోపాల్, రైతు, మర్లపల్లి, గద్వాల మండలం
కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడ్డాం
కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పట్లో లారీ వస్తుందం టే పొద్దున్నే సింగిల్‌విండో కార్యాలయానికి వెళ్లి పని, తిండి వదులుకొని ఎరువులు తెచ్చుకునేటోళ్లం. ముందుగానే చెప్పులను మా వంతుగా క్యూలో పెట్టేవాళ్లం. ఇప్పుడు ఆ సమస్య తీరింది. సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇస్తుండడంతో ప్రశాంతంగా పంటలు సాగు చేసుకుంటున్నం. దానికి తోడు పెట్టుబడి సాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారు. ఇలాంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే.. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నా అభిప్రాయం.
– చీర్ల యాదయ్యసాగర్, కొత్తకోట
కందనూలు జిల్లాలో సాగువిస్తీర్ణం అంచనా :
5,43,075 ఎకరాలు ఎరువుల అంచనా (మెట్రిక్ టన్నుల్లో)
యూరియా : 65,493
డీఏపీ : 18,138
ఎంవోపీ : 3,865
ఎస్ఎస్పీ: 2,286
కాంప్లెక్స్: 38,739
జూలైలో అంచనా : 19,286మెట్రిక్ టన్నులు
అందుబాటులో ఉన్నది : 20,877మెట్రిక్ టన్నులు
జోగుళాంబ గద్వాల జిల్లా
సాగు విస్తీర్ణం అంచనా : 3,80,004 ఎకరాలు
అవసరమైన ఎరువులు : 1.03 లక్షల మెట్రిక్ టన్నులు
మహబూబ్‌నగర్ జిల్లా సాగు విస్తీర్ణం అంచనా : 3,77,000 ఎకరాలు
అవసరమైన ఎరువులు : 55,000 మెట్రిక్ టన్నులు
నారాయణపేట జిల్లా
సాగు విస్తీర్ణం అంచనా : 4.30లక్షల ఎకరాలు
అవసరమైన ఎరువులు : 47,000 మెట్రిక్ టన్నులు
అవసరమైన విత్తనాలు :
26 వేల క్వింటాళ్లు
వనపర్తి జిల్లా సాగు
విస్తీర్ణం అంచనా : 2,53,679 ఎకరాలు
అవసరమైన ఎరువులు
: 60,600 మెట్రిక్ టన్నులు
లాఠీ దెబ్బలు తప్పినయ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు రాత్రి వేళ సింగిల్‌విండో కార్యాలయాలు, పోలీస్స్టేషన్ల వద్ద లైన్లో నిలబడి ఎరువులు తీసుకునేవాళ్లం, అప్పుడప్పుడూ లాఠీ దెబ్బలు కూడా తిన్నం. తెలంగాణ ఏర్పాటు అయ్యాక మా కష్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చారు. రైతులకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా లభిస్తున్నాయి. రైతులకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– విష్ణుకాంత్‌రెడ్డి, రైతు,పూసల్‌పహాడ్, పేట జిల్లా.