గండీడ్, జూన్ 14 : రైతు మిత్రులుగా భావించే ఆరుద్ర పురుగులు ఈ ఏడాది ముందుగానే కనిపించాయి. ఆరుద్ర పురుగులు తొలకరి వానలు కురియగానే నేలపై కనువిందు చేస్తాయి. ఎరుపు రంగులో ఉండే ఈ పురుగు బీడు వారిన పొలంలో తొలకరి వర్షాలు కురువగానే మట్టిలోంచి వస్తాయి. వర్షాకాలంలో కనిపించే ఈ ఎర్రని పురుగు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ పురుగు కనిపించింది అంటే రైతులు ఆనంద పడిపోతారు. ఎందుకంటే ఆ ఏడాదంతా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని నమ్ముతారు. చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతూ పంటలు సమృద్ధిగా పండుతాయి అని అలాగే దిగుబడులు కూడా బాగా వస్తాయని చెబుతుంటారు.
భూమికి సింధూరం బొట్టు లాగ ఎర్రగా ఉండే ఈ పురుగును ఆరుద్ర పురుగు అంటారు. ప్రస్తుతం ఈ పురుగులు మృగశిర కార్తెలో కనిపించాయి. ఆరుద్ర కార్తి అంటేనే మొదట గుర్తుకు వచ్చేది ఈ ఆరుద్ర పురుగులే. ఈ ఆరుద్ర పురుగులను మనం ముట్టుకోగానే అక్కడే ఆగిపోతాయి. కాసేపటి తర్వాత ముందుకు సాగుతాయి. ఈ పురుగులతో అప్పట్లో పిల్లలు ఆడుకునే వారు ప్రస్తుతం వీటి గురించి చెప్పేవారు కూడా కరువయ్యారు. ఈ పురుగులు తొలకరి వర్షాలకు నేలను చదువు చేయగా నేలలో ఉన్న చీడ పురుగుల లార్వాలను తిని పంటలు విత్తక ముందే రైతులకు మేలు చేస్తాయని రైతులు తెలుపుతున్నారు.