మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, అక్టోబర్ 21 : మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, సంస్థ ఆధ్వర్యంలో 189 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈనెల మూడో వారంలో వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నవంబర్ మొ దటి వారంలో పూర్తిస్థాయిలో సెంటర్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సీజన్లో సాధారణ రకం 36,928 మెట్రిక్ టన్నులు, సన్న రకాలు 2,94,817 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో సాధారణ రకం 22195 మెట్రిక్ టన్నులు, సన్న రకాలు 1,76,855 మెట్రిక్ టన్నులు మొత్తం 1,99, 050 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 189 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండ గా.. వీటిలో ఐకేపీ 95, పీఏసీసీఎస్ 89, ఇతర 5 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నా యి.
గన్నీ బ్యాగులు 49.76 లక్షలు అవసరం ఉండగా 30.42 లక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 19.33 లక్షలు గన్నీ బస్తాలు అవసరం ఉన్నది. మొత్తం 74 మిల్లులకు ధాన్యం కేటాయించనున్నారు. ఇందులో రా రైస్ మిల్లింగ్‌కు 53 కేంద్రాలు, బా యిల్డ్ రైస్ మిల్లులు 21కి ధాన్యం కేటాయించారు. కాగా, ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2,320 మద్దతు ధర కల్పించనున్నారు. అయితే, సన్న రకాలకు యాసంగి నుంచే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇవ్వకుండా రైతులను మోసం చేసింది. ఈసారైనా బోనస్ ఇస్తే సన్నరకాలకు రూ.2,820 మద్దతు ధర దక్కనున్నది.
కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తాం. దళారులను నమ్మి మోసపోవద్దు. నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి. ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 24 గంటల్లోగా రైతుల ఖాతా ల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేశాం.
– విక్రమ్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా ఇన్చార్జి మేనేజర్, మహబూబ్‌నగర్