పోడు రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. దశాబ్దాల కాలంగా హక్కు పత్రాల కోసం ఎదురు చూస్తున్న పోడు భూములకు పట్టాల ఆకాంక్షను సీఎం కేసీఆర్ త్వరలో తీర్చనున్నారు. తొలి విడుతలో భాగంగా కొందరు రైతులకు పట్టాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 15వ తేదీ వరకు అర్హులను ఎంపిక చేసి జాబితాను సిద్ధం చేయనున్నారు. పాస్ పుస్తకాల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు ఉంచనున్నారు. విడుతల వారీగా అర్హులందరికీ పట్టాలు అందించనున్నారు. దీంతో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ పోడు రైతుల సమస్యను గుర్తించి శాశ్వత హక్కు కల్పించేలా పట్టాల పంపిణీ చేపట్టేందుకు అధికార యంత్రాంగానికి ఆదేశించా రు. దీంతో గతేడాది నవంబర్, డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరించి గ్రామస్థాయి నుంచి జిల్లాస్థా యి వరకు విచారణ నిర్వహించారు. అటవీహక్కు చట్టం-2006ప్రకారం గిరిజనేతరులు అటవీభూముల్లో కనీసం మూడు తరాలు అంటే దాదాపుగా 75సంవత్సరాలపాటు సాగు చేస్తుంటే పోడు పట్టా కు అర్హులు. గిరిజనులు మాత్రం 2005కు ముం దు నుంచి సాగులో ఉంటే అర్హులుగా నిర్ణయించిం ది. ఇలా పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులు అంచనాలకు మించాయి. వచ్చిన దరఖాస్తులను గూగుల్ మ్యా ప్ ద్వారా పరిశీలించారు. ఇలా వచ్చిన దరఖాస్తు ల్లో అర్హులకు పట్టాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నెల 11వ తేదీవరకు జిల్లా కమిటీ సమావేశాలు నిర్వహించి తొలి విడుతగా కొందరికి పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఎంపిక చేసిన రైతుల పేర్లతో పాసు పుస్తకాలు తయారు చేయనున్నారు. దీనికోసం రైతుల ఓటరు కార్డు, రేషన్‌కార్డు లేదా గ్రామ పెద్ద ధ్రువీకరణ పత్రంలో ఏదైనా ఒక ఆధారాన్ని ఆన్లైన్లో జతపర్చనున్నారు. రైతుల ఆధార్, ఓటరు వివరాల మేరకు పౌరసరఫరాలశాఖ, జిల్లా ఎన్నికల ఆన్లైన్లో నుంచి ఆర్డీవోలు వివరాలు సేకరిస్తారు. డూప్లికేట్ దరఖాస్తులు, మైనర్లు, సేద్యంలో లేని రైతుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. కాగా, పోడు పట్టాలు పది ఎకరాలకన్నా ఎక్కువగా ఉండకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏడెకరాల పైగా పోడు పట్టాలున్న రైతుల దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవడం లేదు. పోడు రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి కొన్ని ప్రతిపాదనలు పంపింది. ఇలా ఎంపిక చేసిన రైతుల పేర్లతో పాసు పుస్తకాలు తయారు చేసి ఈ నెల 15వ తేదీ నాటికి పంపిణీకి సిద్ధంగా ఉంచనున్నారు. ఉమ్మడి పాలమూరులో చూస్తే నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా 11,800 మంది రైతులు దరఖా స్తు చేసుకోగా మహబూబ్‌నగర్‌లో 3,550 మంది, వనపర్తిలో 3,229 మంది, నా రాయణపేటలో 377మంది, గద్వాలలోఅత్యల్పంగా కేవ లం 9దరఖాస్తులు వచ్చాయి. మొత్తం మీద పోడు భూముల పంపిణీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుతుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
పోడు భూములపై నవంబర్‌లో దరఖాస్తులు స్వీకరించకముందు అధికారుల అంచనా మేరకు 2,302మంది రైతుల ఆధీనంలో 7,449ఎకరాల ఆయకట్టు చెంచులు, చెంచేతరుల స్వాధీనంలో ఉన్నట్లుగా భావించారు. అయితే దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక ఊహించినదాని కంటే అధికంగా పోడుభూములపై వినతులు రావడం కొసమెరుపు. ఏకంగా 11,800మంది రైతుల నుంచి 35వేల ఎకరాల కోసం దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. ఇందులో ఎస్టీ రైతులు 4,614మంది నుంచి 17,166ఎకరాలకు గానూ దరఖాస్తులు రాగా, 5,517మంది గిరిజనేతరులు 18,024ఎకరాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి పాలమూరులోనే నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా పోడు భూములు ఉన్నాయి. 65గ్రామ పంచాయతీలు, 76 ఆవాసాల పరిధిలో రైతులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం, చిట్లంకుంట, లక్ష్మాపూర్, కొల్లాపూర్ మండలంలో ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, సోమశిల, పెద్దకొత్తపల్లి మండలంలోని చంద్రబండతండా, మారేడుమాన్దిన్నెతండా, అచ్చంపేట, పదర, లింగాల మండలాల్లో అధికసంఖ్యలో పోడు రైతులు ఉన్నారు. జిల్లాలో 1950మందికి పట్టాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 300దరఖాస్తుల పరిశీలన, సర్వే వంద శాతం పూర్తయింది. సబ్ డివిజన్ లెవల్ కమిటీ సమావేశాల్లో ఆమోదం జరిగింది. అచ్చంపేటలో 1082, కొల్లాపూర్‌లో 798, కల్వకుర్తిలో43దరఖాస్తులను పరిశీలించారు. మిగిలిన దరఖాస్తులను పరిశీలించి పట్టాల పంపిణీకి కలెక్టర్ ఆధ్వర్యంలో ఆయాశాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోనున్నాయి.
ప్రభుత్వ నిబంధనల మేరకే నాగర్‌కర్నూల్ జిల్లాలో 11వేలకుపైగా పోడుభూముల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటివరకు 300దరఖాస్తులను వందశాతం పరిశీలించాము. ఈ నెల 15వ తేదీవరకు జిల్లాలో 1,950మందికి తొలి విడుతలో పట్టా పాసుపుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అటవీ భూపరిరక్షణ, అర్హులైన రైతులకు హక్కులు కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశం. జిల్లాలో అత్యధికంగా పోడు భూముల సమస్యలు ఉన్నాయి.
-ఉదయ్‌కుమార్ కలెక్టర్, నాగర్‌కర్నూల్ జిల్లా