తిమ్మాజిపేట,జనవరి 7: భక్తులు ఇలవేల్పుగా కొలిచే అప్పాజిపల్లి నర్సన్న బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి నిర్వహిం చనునట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఏకార్యం తలపెట్టినా స్వామిని ధర్శించాల్సిందేనని ఇక్కడి భక్తుల నమ్మకమని వారు తెలిపారు.
ఆలయ చరిత్ర
నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశ్యపుడి సంహారం తర్వాత స్వామి వారు అప్పాజిపల్లి గుట్టపై సేదదీరాడని కథనం. సుమారు వంద సంవత్సరాల కిందట గుట్టపై నరసింహస్వామి ఉన్నట్లు గుర్తించినట్లు స్థలపురాణం చెబు తోంది. గుట్టపై భారీ రాతి బండ కింద ఉన్న స్వామిని దర్శించుకోడానికి భక్తులు పాకుతూ వెళ్లాల్సి వచ్చేదని క్రమంగా రాతిని తొలచి, గర్భగుడి నిర్మించినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఆలయ పునర్నిర్మాణం
నర్సన్న గుట్టపై లక్ష్మీనర్సింహస్వామికి దేవాలయాన్ని దాతలు,ప్రభుత్వ సహకారంతో గ్రామస్తులు పునర్నిర్మాణం చేశారు. గతంలో భక్తులు గుట్టపైకి నడిచి వెళ్లాల్సి ఉండేదని. ప్రస్తుతం భారీ వాహనాలు కూడా వెళ్ళేలా సీసీ రోడ్డును వేశారు. రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలను నాటి ఆహ్లాదంగా మార్చారు. గుట్టపై వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. గుట్ట కింద ప్రవేశ ద్వారాన్ని నిర్మించారు. గ్రామానికి వెళ్లే దారిలో గుమ్మకొండ గ్రామం వద్ద దేవాలయ ఆర్చీని నిర్మించారు. రెండు సంవత్సరాల కిందట తెలంగాణ దేవాదాయశాఖ నుంచి సుమారు రూ.68లక్షల మంజురుకావడంతో ఆలయాన్ని ఆధునీకరించారు. ప్రధాన ఆలయంతో పాటు, ఆంజనేయస్వామి ఆలయం, చెంచులక్ష్మి, ఆధిలక్ష్మి అమ్మవార్ల ఆలయాలు నిర్మించారు.
ఆలయం ఎదుట ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నారు. కోడుపర్తి గ్రామానికి చెందిన సురేందర్‌రెడ్డి,రాజేందర్‌రెడ్డి సోదరుల సహకారంతో ఆలయం ముందు విశాలంగా మండపాన్ని , చుట్టు గ్రిల్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డి దంపతులు భక్తుల కోసం రూ.5 లక్షలతో వంటశాలను నిర్మించారు. ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి నిధులతో భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు నిర్మించారు. గుమ్మకొండ సర్పంచ్ సత్యం యాదవ్ సహకారంతో స్వామి వారి కోసం పూలతోటను ఏర్పాటు చేశారు. ్ర పస్థుతం స్వామి వారికి పలువురు భక్తులు ఆభరణాలు బహూకరించారు. గుట్టపై అతిథిగృహాలు నిర్మిం చారు. ఇక్కడ ప్రతి శనివారం,పర్వదినాలలో స్వామి వారికి అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉత్సవాలు
ప్రతి సంక్రాంతికి స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 13న ఉత్సవాల అంకురార్పన, సుదర్శన హోమం, సాయంత్రం పల్లకీ సేవా , 14న శనివారం స్వామివారి కల్యాణం, అన్నదానం, రాత్రికి రథోత్సవం, 15న సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, జాతర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఉత్సవాలకు చుట్టపక్కల గ్రామల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎడ్ల బండ్ల ప్రదర్శన అనంతరం ఉద్దాల కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.